భారత్ సమాచార్, తూర్పుగోదావరి జిల్లా: ప్రపంచ న్యుమోనియా దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం మండలంలోని అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వైద్యాధికారులు డా. వి. భవాని, డా. ఇ. యేసు రాణి, డా. ఎం. శైలజారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో న్యుమోనియా వ్యాధి లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించారు.
పీహెచ్‌సీలో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన డా. భవాని మాట్లాడుతూ.. న్యుమోనియా అనేది ఊపిరితిత్తులకు సోకే వ్యాధి అని, ముఖ్యంగా చలికాలంలో దీని బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. చిన్నపిల్లల్లో ఈ వ్యాధి పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
పిల్లల్లో దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరి పీల్చుకునేటప్పుడు పిల్లికూతల వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదని చెప్పారు. ఇలాంటి లక్షణాలు గుర్తించిన వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్య చికిత్స పొందాలని సూచించారు. సకాలంలో చికిత్స అందించడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించుకోవచ్చని వివరించారు.
న్యుమోనియా నివారణకు చిన్నారులకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం టీకాలు వేయించాలని వైద్యులు సూచించారు. చలిగాలులు, వర్షం నుంచి పిల్లలను కాపాడాలని, అవసరమైనప్పుడు మాస్కులు, స్వెటర్లు ఉపయోగించాలని తెలిపారు. ఇంట్లో కట్టెల పొయ్యిల నుంచి వచ్చే పొగకు, ధూమపానానికి దూరంగా ఉండాలని సూచించారు. అలాగే ఘాటైన వాసనలు కలిగిన రసాయనాల నుంచి రక్షణ పొందాలని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఈఓ వై.ఎస్. రాయుడు, పీహెచ్‌ఎన్ కె. ఆదిలక్ష్మి, సూపర్‌వైజర్లు కె. సుధాకర్, ఎన్. అనురాధ, స్టాఫ్ నర్స్ కె. కిరణ్మయి, ఎల్‌టీ శిల్ప, ఫార్మసిస్ట్ ఎ. నగేష్, హెల్త్ అసిస్టెంట్ పి. నందీష్, ఏఎన్‌ఎం కె. శారద, ఆశ కార్యకర్తలు ఎం. జ్యోతి, ఎం. దేవి, ఎఫ్‌ఎన్‌ఓ మాధురి, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.