భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

12, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

నీటి వృథాను అరికట్టేందుకు గ్రామసభల్లో సూచనలు

రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ సుతార్ పల్లి గ్రామాలలో గ్రామసభలు

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నీటి పొదుపు, పశుగ్రాసం సంరక్షణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రాబోయే రోజుల్లో తాగునీరు, పశువుల నీటి అవసరాలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని ఆర్. వెంకటాపూర్, సుతార్ పల్లి గ్రామాల్లో గురువారం ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాల మేరకు రెవెన్యూ, మండల అభివృద్ధి, వ్యవసాయ, విద్యుత్, నీటిపారుదల, పశుసంవర్ధక శాఖల అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.

రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ సుతార్ పల్లి గ్రామాలలో గ్రామసభలు

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ నీటిని జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. నీటి వృథాను అరికట్టడంతో పాటు గ్రామాల్లో ఇంకుడు గుంతలు నిర్మించి వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా ఉపయోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో నీటి సమస్యలను కొంతవరకు నివారించవచ్చని వివరించారు.

రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ సుతార్ పల్లి గ్రామాలలో గ్రామసభలు

రాబోయే రోజుల్లో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున గ్రామస్థులు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ రజనీకుమారి సూచించారు. రైతులు ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగు చేసుకునే ఆరుతడి పంటలను ఎంచుకోవాలని తెలిపారు. పంటల సాగుతో పాటు మూగజీవాలకు కూడా నీటి కొరత రాకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.

రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ సుతార్ పల్లి గ్రామాలలో గ్రామసభలు

సుతార్ పల్లిలో నిర్వహించిన గ్రామసభలో మండల పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పశువులకు తాగునీటి ఇబ్బందులు రాకుండా గ్రామాల్లో నీటి తొట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వరి కోతల సమయంలో లభించే గడ్డిని వృథా చేయకుండా భద్రపరచుకోవాలని, రాబోయే రోజుల్లో పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పశుగ్రాసం పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు కేటాయించే అవకాశం ఉందని వివరించారు.

రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ సుతార్ పల్లి గ్రామాలలో గ్రామసభలు

ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో షాజీలుద్దీన్, మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్, ఆర్. వెంకటాపూర్ సర్పంచ్ వెంకుగారి ఉమా సంజీవరెడ్డి, సుతార్ పల్లి సర్పంచ్ సునీల్, గ్రామ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.