భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

12, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి

ధాన్యం కొనుగోళ్లలో జాప్యమెందుకు..?  బీఆర్ఎస్, బీఎస్పీ నాయకుల డిమాండ్

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని BRS, BSP నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డుకు పంటను తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంపై ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. గురువారం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కొనుగోలు కేంద్రం ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు ఎందుకు ప్రారంభించలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించి కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా BRS హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు 15 నుంచి 20 రోజులుగా ధాన్యాన్ని మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. మిల్లుల అనుసంధాన ప్రక్రియ పూర్తికాకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయని చెప్పారు. దీంతో రైతులు చేసేదేమీ లేక ప్రైవేటు మిల్లర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

ప్రైవేటు మిల్లర్లు తేమ, తరుగు పేరుతో కోతలు విధిస్తూ రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు అండగా ఉంటామని చెబుతున్న ప్రభుత్వం కొనుగోళ్ల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని డిమాండ్ చేశారు.

అనంతరం BSP హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి దాదాపు 20 రోజులుగా అక్కడే పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యంలో తేమ శాతాన్ని పరీక్షించే యంత్రాలు సైతం అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులు ఆందోళనకు దిగిన తర్వాతే యంత్రాలు అందించే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.

మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు రైతుల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. కొనుగోళ్లలో జాప్యం కారణంగా విసిగిపోయిన రైతులు ప్రైవేటు మిల్లర్లకు తక్కువ ధరకు ధాన్యం విక్రయించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వాతావరణ పరిస్థితులు మారుతుండటంతో మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన ధాన్యం వర్షాలకు తడిసిపోతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు.

ఇప్పటికే మార్కెట్ యార్డులో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, మిల్లుల అనుసంధాన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి కొనుగోళ్లకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని నాయకులు డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.