భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు విలువ, ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు హుస్నాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని ZPHS బాలికల, బాలుర పాఠశాలల్లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ (ELC) ఆధ్వర్యంలో గురువారం క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఎన్నికల ఓటరు జాబితా తయారీ విధానం, EVM, VVPAT వినియోగం, పోలింగ్ నిర్వహణ, ఓట్ల లెక్కింపు వంటి అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించారు. అదేవిధంగా స్వచ్ఛమైన ఓటరు జాబితా ప్రాధాన్యం, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాల్సిన అవసరంపై వ్యాసరచన పోటీలు చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా RDO రామ్మూర్తి, తహసీల్దార్ లక్ష్మారెడ్డి, MEO మనీల, ఎన్నికల DT భూక్య రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యం, ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికల నిర్వహణ విధానాల గురించి వివరించారు. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఉన్న కీలకమైన హక్కు అని, దానిని సరైన రీతిలో వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
విద్యార్థులకు చిన్న వయస్సు నుంచే ఎన్నికల వ్యవస్థపై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో బాధ్యతాయుతమైన ఓటర్లుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్లో పది మందిని జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కే. వాసుదేవరెడ్డి, జి. మహేందర్, ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి, శంకర్, బోడ ప్రభాకర్‌రెడ్డి, డి. సంపత్‌రెడ్డి, రమణారెడ్డి, CRPలు జ్యోష్ణ, స్వప్న, స్వామి తదితరులు పాల్గొన్నారు.