భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తిలోని బంజర కుంట చెరువు మధ్యలో జరుగుతున్న బావి తవ్వకాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ పలువురు రైతులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. చెరువు పరిధిలో అక్రమంగా బావి తవ్వుతున్నారని, దీనివల్ల తమ సాగు భూములకు నీటి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
రైతులు వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. చెరువు సమీపంలో మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న కోళ్ల ఫామ్‌కు నీటిని అందించేందుకు చెరువు మధ్యలో బావి తవ్వుతున్నట్లు ఆరోపించారు. ఈ తవ్వకాలు కొనసాగితే చెరువు కింద ఉన్న సుమారు 50 మంది రైతులకు చెందిన 70 ఎకరాల సాగు భూమికి నీరు అందకుండా పోయే ప్రమాదం ఉందని తెలిపారు.
ఇప్పటికే సాగునీటికి ఈ చెరువు ఆధారంగా ఉన్న రైతులకు బావి తవ్వకం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా చెరువు ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. చెరువును కాపాడటంతో పాటు రైతుల సాగునీటి హక్కులకు ఇబ్బంది కలగకుండా అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.
ఈ సమస్యపై గతంలో స్థానిక తహసీల్దార్‌తో పాటు నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు రైతులు వివరించారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో తాజాగా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. చెరువులో జరుగుతున్న తవ్వకాలను పరిశీలించి, వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ వినతిపత్రం అందజేసిన వారిలో వరదలు అశోక్, ఎన్. జగ్గయ్య, వెంకన్న, జె. రవి తదితర రైతులు ఉన్నారు.