భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడంతో పాటు సైన్స్‌పై ఆసక్తిని ప్రోత్సహించే లక్ష్యంతో జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) ఆధ్వర్యంలో ఇనుగుర్తి మండల కేంద్రంలో పాఠశాల స్థాయి 'చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్'ను ఘనంగా నిర్వహించారు. జేవీవీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పరీక్షలను నిర్వహించారు.
ఇనుగుర్తి, కోమటిపల్లి, చిన్నముప్పారం ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఇనుగుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక ఇనుగుర్తి మండల అధ్యక్షుడు దార్ల భాస్కర్, గౌరవ అధ్యక్షుడు చిన్నాల కట్టయ్య, ప్రధాన కార్యదర్శి ఆది చందు, చెకుముకి కన్వీనర్ వేముల శ్రీనివాస్ ఆయా పరీక్ష కేంద్రాలను సందర్శించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులకు ప్రశ్నాపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా జేవీవీ నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే సైన్స్‌పై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమాజంలో ఇంకా కొనసాగుతున్న మూఢనమ్మకాలను ప్రశ్నించే ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. శాస్త్రీయ దృక్పథంతో ప్రతి విషయాన్ని పరిశీలిస్తూ, నిజానిజాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు.
సైన్స్ ఆధారంగా ఆలోచించడం వల్ల సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని వారు పేర్కొన్నారు. విద్యార్థులు మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ, శాస్త్రీయ దృక్పథాన్ని తమ జీవితాల్లో భాగం చేసుకోవాలని సూచించారు.
పాఠశాల స్థాయిలో నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ నెల 21న మండల స్థాయి చెకుముకి పరీక్ష నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.