భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు, సర్పంచులు కలిసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ ఆదేశాల మేరకు గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో వివిధ గ్రామాల సర్పంచులతో అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మండలంలోని పలువురు సర్పంచులు పాల్గొని తమ గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు అందించారు.
గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, గ్రావెల్ రోడ్లకు సంబంధించిన ప్రతిపాదనలు, వివిధ హాబిటేషన్లకు వెళ్లేందుకు అవసరమైన దారి రోడ్ల నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. అలాగే ప్రతి గ్రామంలో రెండు పంట కుంటలు ఏర్పాటు చేయడం, పశువుల కోసం నీటి తొట్లు నిర్మించడం, పశువులకు అవసరమైన గడ్డిని పెంచేందుకు చర్యలు తీసుకోవడం వంటి అంశాలను ప్రస్తావించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులను ప్రోత్సహించడంతో పాటు కూలీలకు రోజుకు ₹.308 వేతనం చెల్లించే అంశంపై కూడా చర్చించారు. ప్రతి గ్రామంలో 100 ఇంకుడు గుంతలు నిర్మించడం, భూగర్భ జలాలను పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం, గ్రామాలకు ఆదాయ వనరులు సమకూర్చేలా ప్రతిపాదనలు రూపొందించడం వంటి అంశాలపై సర్పంచులు, అధికారులు సమాలోచనలు జరిపారు.
గ్రామాల అవసరాలను బట్టి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సింగారపు కుమార్, ఎంపీఓ రమణ కుమార్, సూపరింటెండెంట్ నరసింహారావు, APO మాధవి తదితరులు పాల్గొన్నారు.