భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బాలికల వసతి గృహాల్లో విద్యార్థినులకు అందుతున్న సదుపాయాలు, భోజనం నాణ్యతను తెలుసుకునేందుకు రామాయంపేట తహసీల్దార్ రజనీకుమారి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని TG సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల బాలికల వసతి గృహాన్ని గురువారం ఆమె సందర్శించారు.
రాత్రి భోజన సమయంలో హాస్టల్‌కు చేరుకున్న తహసీల్దార్.. విద్యార్థినులకు వడ్డిస్తున్న ఆహారాన్ని స్వయంగా పరిశీలించారు. భోజనం నాణ్యత, వంటకు ఉపయోగిస్తున్న సరుకులు, నిత్యావసర వస్తువుల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందించే ఆహార విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు.
అనంతరం విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లో వసతి సదుపాయాలు ఎలా ఉన్నాయి? భోజనం నాణ్యంగా అందుతోందా? ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అని ఆరా తీశారు. విద్యార్థినులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
విద్యార్థినుల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి నాణ్యమైన భోజనంతో పాటు మెరుగైన వసతి సదుపాయాలు కల్పించాలని తహసీల్దార్ సూచించారు. హాస్టల్ నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు.