భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

8 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి ‘రామాయణం’..

8 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి ‘రామాయణం’..

భార‌త్ సమాచార్, సినిమా : బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ మైథలాజికల్ మూవీ ‘రామాయణం’ ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన మొదటి వారం నుంచే భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రం తాజాగా రూ.1,000 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా నటించారు. నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి రోజే సుమారు రూ.128 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి తన సత్తా చాటింది.

సినిమాకు వచ్చిన ప్రేక్షకుల స్పందన, పాజిటివ్ మౌత్ టాక్ వసూళ్ల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. ముఖ్యంగా దీపావళి సెలవులు, గోవర్ధన పూజ, భాయ్ దూజ్ పండుగల సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. ట్రేడ్ లెక్కల ప్రకారం తొలి ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.934.55 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇందులో భారత్ నుంచి రూ.611.05 కోట్ల గ్రాస్ రాగా, విదేశీ మార్కెట్ల నుంచి రూ.323.50 కోట్లు వచ్చాయి. ఎనిమిదో రోజు అడ్వాన్స్ బుకింగ్స్, స్పాట్ బుకింగ్స్‌తో కలెక్షన్లు మరింత పెరిగాయి.

ఈ విజయంతో అత్యంత వేగంగా రూ.1,000 కోట్ల వసూళ్లను సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో ‘రామాయణం’ మూడో స్థానాన్ని దక్కించుకుంది. కేవలం ఏడు రోజుల్లోనే ఈ ఘనత సాధించిన ‘పుష్ప 2: ది రూల్’, ‘ధురంధర్: ది రివెంజ్’ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ‘బాహుబలి 2’ పది రోజుల్లో, ‘RRR’ 16 రోజుల్లో, ‘KGF చాప్టర్ 2’ 18 రోజుల్లో ఈ మైలురాయిని చేరుకున్నాయి.

ఇప్పటివరకు రూ.1,000 కోట్ల క్లబ్‌లో చేరిన భారతీయ చిత్రాల సంఖ్య 11కు చేరినట్లు హిందుస్థాన్ టైమ్స్ కథనం పేర్కొంది. 2017లో ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించగా, ఆ తర్వాత ‘దంగల్’ కూడా ఈ జాబితాలో చేరింది. ఇప్పుడు ‘రామాయణం’ కూడా అదే స్థాయిలో రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా విజయంతో రణబీర్ కపూర్ కెరీర్‌లోనే అతిపెద్ద బాక్సాఫీస్ హిట్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వసూళ్లకు సంబంధించిన ట్రేడ్ గణాంకాలు మారే అవకాశం ఉంది.