భారత్ సమాచార్, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విశాఖపట్నంలో గురువారం ప్రారంభమైన 31వ CII పార్ట్నర్షిప్ సదస్సులో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో TDP, జనసేన, BJP కూటమి రెండున్నరేళ్లుగా ఎలాంటి విభేదాలు లేకుండా స్థిరంగా కొనసాగుతోందని చెప్పారు. రాజకీయ స్థిరత్వం, పారిశ్రామిక అభివృద్ధి, సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా మార్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురానుందని చంద్రబాబు ప్రకటించారు. ఒక ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలు, రాయితీలు, అనుమతులను తర్వాత వచ్చే ప్రభుత్వం రాజకీయ కారణాలతో రద్దు చేయకుండా ఈ చట్టం రక్షణ కల్పించనుంది. ఇదే విధమైన చట్టాన్ని జాతీయ స్థాయిలోనూ తీసుకురావాలని పీయూష్ గోయల్‌ను కోరారు. మరోవైపు రాష్ట్రంలో పెట్టుబడుల ప్రోత్సాహానికి ఎస్క్రో ఖాతాల విధానాన్ని కూడా అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. విశాఖపట్నం ఆలోచనలు, పెట్టుబడులు, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు వేదికగా మారుతోందని అన్నారు. వ్యాపారాలకు అత్యంత అవసరమైనది నమ్మకమని, ప్రభుత్వ నిబద్ధత, స్థిరత్వం, భాగస్వామ్యాల ద్వారానే అది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సైతం భారత్ ప్రపంచ దేశాలకు విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తోందని చెప్పారు. మేధో సంపత్తి హక్కులను గౌరవిస్తూ, పెట్టుబడిదారుల ప్రయోజనాలకు భారత్ ప్రాధాన్యమిస్తుందని భరోసా ఇచ్చారు.
మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. తాజా సదస్సులో రూ.9.89 లక్షల కోట్ల విలువైన 303 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే ప్రణాళిక ఉందని, దీంతో రాష్ట్రానికి రెండున్నరేళ్లలో వచ్చిన మొత్తం పెట్టుబడి హామీలు రూ.32.49 లక్షల కోట్లకు చేరనున్నాయని ట్రేడ్ వర్గాల కథనాలు వెల్లడించాయి. విశాఖను అంతర్జాతీయ పారిశ్రామిక, సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.