భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

కాలేజీల్లో సినీ ఈవెంట్లపై మహిళా కమిషన్‌కు ప్రీతిరెడ్డి వివరణ..

కాలేజీల్లో సినీ ఈవెంట్లపై మహిళా కమిషన్‌కు ప్రీతిరెడ్డి వివరణ..

భార‌త్ సమాచార్, హైద‌రాబాద్ : మల్లారెడ్డి విద్యాసంస్థల్లో సినీ కార్యక్రమాల నిర్వహణపై వస్తున్న విమర్శలు, వివాదాల నేపథ్యంలో యాజమాన్యం స్పందించింది. ఈ క్రమంలో మల్లారెడ్డి విద్యాసంస్థల వైస్ చైర్మన్, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారదను కలిశారు. కమిషన్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో విద్యాసంస్థల ప్రాంగణాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, వాటి ప్రభావం, విద్యార్థుల భద్రత వంటి అంశాలపై చర్చించినట్లు తెలిసింది. కమిషన్ లేవనెత్తిన సందేహాలు, ప్రశ్నలకు ప్రీతిరెడ్డి వివరణ ఇచ్చారు.

భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రీతిరెడ్డి.. విద్యాసంస్థల వైస్ చైర్మన్‌గా కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్లు వెల్లడించారు. తమ విద్యాసంస్థల్లో తరచూ సినీ ఈవెంట్లు జరుగుతున్నాయంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఏడాదిలో 365 రోజులకు గాను, తమకు చెందిన మూడు వేర్వేరు క్యాంపస్‌లలో కేవలం మూడు కార్యక్రమాలు మాత్రమే నిర్వహించినట్లు వివరించారు. ఈ కార్యక్రమాల కారణంగా విద్యార్థుల విద్యాభ్యాసానికి, రోజువారీ తరగతులకు ఎలాంటి ఆటంకం కలగలేదని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి జారీ చేసిన మార్గదర్శకాలను తమ విద్యాసంస్థలు తప్పనిసరిగా పాటిస్తాయని ప్రీతిరెడ్డి హామీ ఇచ్చారు. విద్యాసంస్థల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరిస్తామని తెలిపారు. కేవలం వేడుకల నిర్వహణకే కాకుండా విద్యార్థుల చదువులు, భద్రతకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమాల సమయంలో విద్యార్థులు సైతం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు.

మరోవైపు తెలంగాణ మహిళా కమిషన్ మహిళలు, విద్యార్థినుల భద్రత, హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తోంది. విద్యాసంస్థల్లో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం, ఫిర్యాదులపై స్పందించడం కమిషన్ బాధ్యతల్లో కీలకమైనవి.