భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక టెక్స్ట్ మెసేజ్‌లూ ఒక్కసారే చూడొచ్చు!

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక టెక్స్ట్ మెసేజ్‌లూ ఒక్కసారే చూడొచ్చు!

భార‌త్ సమాచార్, టిక్నాల‌జీ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీని మరింత మెరుగుపరిచే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటివరకు ఫొటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్‌లకు మాత్రమే పరిమితమైన ‘వ్యూ వన్స్’ సదుపాయాన్ని ఇప్పుడు సాధారణ టెక్స్ట్ మెసేజ్‌లకూ విస్తరిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా పంపిన సందేశాన్ని అవతలి వ్యక్తి ఒక్కసారి మాత్రమే తెరిచి చదవగలరు. చదివిన తర్వాత ఆ స్క్రీన్‌ను మూసివేస్తే సందేశం తిరిగి అందుబాటులో ఉండదు. ప్రస్తుతం ఎంపిక చేసిన ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులకు ఈ ఫీచర్‌ను క్రమంగా అందిస్తున్నారు.

ఈ సదుపాయం ద్వారా వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు, వన్‌టైమ్ కోడ్‌లు వంటి వివరాలను తాత్కాలికంగా పంపుకోవచ్చని భావిస్తున్నారు. సాధారణంగా వాట్సాప్‌లో పంపిన టెక్స్ట్ మెసేజ్‌లు చాట్‌లో అలాగే ఉండిపోతాయి. కానీ వ్యూ వన్స్ ఎంపికతో పంపిన సందేశం మాత్రం ప్రత్యేక స్క్రీన్‌లో కనిపిస్తుంది. రిసీవర్ దాన్ని ఓపెన్ చేసి చదివిన తర్వాత మూసివేస్తే, చాట్‌లో ఆ మెసేజ్ స్థానంలో ‘ఓపెన్డ్’ అనే సూచన కనిపిస్తుంది. రీడ్ రిసీట్స్ ఆన్‌లో ఉంటే పంపిన వ్యక్తికి కూడా సందేశాన్ని చదివిన విషయం తెలుస్తుంది.

ఈ ఫీచర్‌ను ఉపయోగించడం కూడా సులభమే. ముందుగా సంబంధిత వ్యక్తి చాట్‌లోకి వెళ్లి సాధారణంగా మెసేజ్ టైప్ చేయాలి. అనంతరం సెండ్ బటన్‌ను నొక్కి పట్టుకుంటే కనిపించే మెనూలో ‘వ్యూ వన్స్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అప్పుడు ఆ సందేశం ఒక్కసారి మాత్రమే చూసే విధంగా పంపబడుతుంది. రిసీవర్ ఆ మెసేజ్‌ను కాపీ చేయడం, ఫార్వర్డ్ చేయడం, సేవ్ చేసుకోవడం, స్క్రీన్‌షాట్ లేదా స్క్రీన్ రికార్డింగ్ చేయడం వంటి చర్యలను వాట్సాప్ నిరోధిస్తుంది.

అయితే ఈ ఫీచర్‌కు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.26.45.6 ఉపయోగిస్తున్న కొంతమంది టెస్టర్లకే ఈ అవకాశం లభిస్తోంది. రాబోయే వారాల్లో మరికొంతమంది బీటా వినియోగదారులకు విస్తరించే అవకాశం ఉంది. సాధారణ వినియోగదారులందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై సంస్థ అధికారిక ప్రకటన చేయలేదు. అంతేకాకుండా, మరో ఫోన్‌తో మెసేజ్‌ను ఫొటో తీయడాన్ని ఈ ఫీచర్ పూర్తిగా అడ్డుకోలేదు. కాబట్టి సున్నితమైన సమాచారాన్ని పంపేటప్పుడు జాగ్రత్త అవసరం.