భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

చెరువును ఆక్రమిస్తున్న క్వారీలపై చర్యలు తీసుకోవాలి: సర్పంచి కుమార్

బేటి చెరువును ఆక్రమిస్తున్న క్వారీలపై చర్యలు తీసుకోవాలి: సర్పంచి కుమార్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రంలోని బేటి చెరువు భూమి ఆక్రమణకు గురవుతోందని, చెరువు పక్కనే తవ్వకాలు నిర్వహిస్తున్న గ్రాన్ మార్ట్ ఎక్స్‌పోర్ట్, శ్రీనివాస గ్రానైట్ క్వారీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచి తమ్మడపల్లి కుమార్ అధికారులను కోరారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు ప్రజావాణిలో కూడా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

గ్రానైట్ క్వారీల్లో తవ్వకాలు జరిపిన తర్వాత వెలువడే వేస్ట్ రాళ్లు, మట్టి, ఇతర వ్యర్థాలను బేటి చెరువు భూమిలో పెద్ద ఎత్తున డంపింగ్ చేస్తున్నారని సర్పంచి ఆరోపించారు. దీనివల్ల గ్రామానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్న చెరువు భూమి క్రమంగా ఆక్రమణకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నంబర్లు 183 నుంచి 191 వరకు ఉన్న మొత్తం 234.32 ఎకరాల విస్తీర్ణంలోని చెరువు భూమిని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. చెరువు స్థలంలో వ్యర్థాలను వేస్తూ భూమిని పాడు చేస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరోవైపు గ్రామానికి సమీపంలో ఉన్న గ్రానైట్ క్వారీల్లో రాత్రనక, పగలనక బ్లాస్టింగ్‌లు నిర్వహిస్తున్నారని కుమార్ తెలిపారు. పేలుళ్ల సమయంలో వచ్చే భారీ శబ్దాలతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. క్వారీల కార్యకలాపాల కారణంగా ధ్వని, వాయు కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల నివాసాలకు దగ్గరగా జరుగుతున్న ఈ కార్యకలాపాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

బేటి చెరువును ఆక్రమిస్తున్న క్వారీలపై చర్యలు తీసుకోవాలి: సర్పంచి కుమార్

కెమికల్స్‌తో చేపలు మృత్యువాత..

గ్రానైట్ క్వారీల నుంచి వెలువడే వ్యర్థాలతోపాటు బ్లాస్టింగ్ తదితర పనుల కోసం ఉపయోగించే కెమికల్స్‌ను చెరువులో డంపింగ్ చేస్తున్నారని సర్పంచి ఆరోపించారు. ఈ వ్యర్థాలు, రసాయనాల కారణంగా రెండు నెలల క్రితం బేటి చెరువులో పెద్ద సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయని తెలిపారు. దీంతో చెరువుపై ఆధారపడి చేపల పెంపకం చేపడుతున్న మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలకు ఎన్నో ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న చెరువు కాలుష్యానికి గురైతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు.

చెరువు భూమిని ఆక్రమిస్తూ, అందులో రాళ్ల వ్యర్థాలు, మట్టి, కెమికల్స్ డంపింగ్ చేస్తున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కుమార్ డిమాండ్ చేశారు. ఇప్పటికే చెరువు భూమిలో వేసిన వ్యర్థాలను వెంటనే తొలగించి, ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్‌లు నిర్వహిస్తూ ధ్వని, వాయు కాలుష్యానికి కారణమవుతున్న గ్రానైట్ క్వారీలపై కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చెరువును పరిరక్షించడంతోపాటు గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించాలని సర్పంచి తమ్మడపల్లి కుమార్ కోరారు.