భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

ఆశా కార్యకర్తల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఆశా కార్యకర్తల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్య పరిరక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న ఆశా కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని BRS పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.

ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (BRTU అనుబంధం) ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అయిలేని మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఆశా కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం వారు నిరంతరం కష్టపడుతున్నారని చెప్పారు. ఇంతటి బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ వారి శ్రమకు తగిన వేతనాలు అందకపోవడం బాధాకరమన్నారు.

ఆశా కార్యకర్తల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు వెయ్యి రోజులు గడుస్తున్నా ఎన్నికల సమయంలో ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని మల్లికార్జున రెడ్డి విమర్శించారు. హామీలు ఇచ్చినప్పుడు చూపించిన శ్రద్ధను ఇప్పుడు వారి సమస్యల పరిష్కారంలోనూ చూపించాలని అన్నారు. గత BRS ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఆశా కార్యకర్తల వేతనాలను పెంచి వారికి అండగా నిలిచారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా వారి సమస్యలను గుర్తించి తక్షణమే స్పందించాలని కోరారు.

ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు కల్పించడంతోపాటు వారు కోరుతున్న ఇతర న్యాయమైన డిమాండ్లను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజారోగ్యం కోసం సేవలందించే కార్యకర్తల సమస్యలను నిర్లక్ష్యం చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని ఆశా కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరారు. వారి డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మేడోజు లక్ష్మి, సుంకరి ప్రేమలత, వేముగంటి శారద, ఆర్. రాధ, బి. నిర్మల, సంగీత, రాజేశ్వరి, మంజులతోపాటు BRS పార్టీ సీనియర్ నాయకులు డికొండ ప్రవీణ్, మాటూరి రాజశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.