భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

గ్రామసభ బహిష్కరించి.. మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా

గౌరవెల్లి కాలువ అలైన్‌మెంట్‌పై రైతుల అభ్యంతరం..!

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: గౌరవెల్లి ప్రాజెక్టు ఎడమ కాలువ డి-4 (13 ఎల్) భూసేకరణకు సంబంధించి హుస్నాబాద్‌లో నిర్వహించిన గ్రామసభకు రైతులు దూరంగా ఉన్నారు. ప్రతిపాదించిన కాలువ అలైన్‌మెంట్ తమ వ్యవసాయ భూములు, కమర్షియల్ ప్లాట్లు, నివాస గృహాలకు నష్టం కలిగించేలా ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ గ్రామసభను మూకుమ్మడిగా బహిష్కరించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా తమ అభ్యంతరాలు, డిమాండ్లతో కూడిన ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ చైర్మన్, పాలకవర్గ సభ్యులకు అందజేశారు. రైతులు గ్రామసభకు హాజరుకాకపోవడంతో సమావేశ మందిరంలోని కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి.

గౌరవెల్లి కాలువ అలైన్‌మెంట్‌పై రైతుల అభ్యంతరం..!

ప్రతిపాదిత కాలువ మార్గం తమ భూముల మీదుగా వెళ్తే వ్యవసాయ భూములతోపాటు కమర్షియల్ ప్లాట్లు, నివాస గృహాలు కూడా నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న తమ కుటుంబాలకు భూములు కోల్పోవడం వల్ల జీవనోపాధి సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. గతంలో ప్రతిపాదించిన కాలువ మార్గానికి, ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులకు చాలా మార్పులు వచ్చాయని వివరించారు. అప్పట్లో వ్యవసాయ భూములుగా ఉన్న కొన్ని ప్రాంతాలు ఇప్పుడు కమర్షియల్ ప్లాట్లుగా అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. ఈ మార్పులను పరిగణనలోకి తీసుకోకుండా భూసేకరణ చేపట్టడం వల్ల అనేక కుటుంబాలు ఇబ్బందులు పడతాయని చెప్పారు.

ప్రతిపాదిత అలైన్‌మెంట్ పరిధిలో నేతాజీ నగర్ కాలనీ, KGBV విద్యాలయం, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, రిజిస్ట్రేషన్ ప్లాట్లు, మున్సిపల్ అనుమతులతో నిర్మించిన నివాస గృహాలు ఉన్నాయని రైతులు తెలిపారు. వీటితోపాటు నాళా ఎక్స్‌టెన్షన్ ప్లాన్, కాకతీయ కాలువ పరిధిలోని భూములు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉందని వివరించారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన కాలనీలు, నివాస ప్రాంతాలకు ఇబ్బందులు కలగకుండా కాలువ మార్గాన్ని మార్చాలని కోరారు. సమీపంలోని వ్యవసాయ భూముల మీదుగా ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్‌ను పరిశీలిస్తే నివాస ప్రాంతాలు, ప్లాట్లకు నష్టం జరగకుండా చూడవచ్చని సూచించారు. ప్రస్తుత ప్రతిపాదనను మరోసారి పరిశీలించి తమ భూములను భూసేకరణ నుంచి మినహాయించాలని అధికారులకు అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు.

గౌరవెల్లి కాలువ అలైన్‌మెంట్‌పై రైతుల అభ్యంతరం..!

రీడిజైన్ సాధ్యం కాదన్న ఆర్డీవో

గౌరవెల్లి కాలువ అలైన్‌మెంట్‌పై రైతుల అభ్యంతరం..!

రైతులు వ్యక్తం చేసిన అభ్యంతరాలపై ఆర్డీవో రామ్మూర్తి స్పందించినట్లు వారు తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు ఎడమ కాలువ అలైన్‌మెంట్‌ను గతంలోనే ఖరారు చేసినందున ఇప్పుడు దానిని మార్చడం లేదా రీడిజైన్ చేయడం సాధ్యం కాదని ఆయన చెప్పినట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుత పరిస్థితులు, భూముల వినియోగంలో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకుని మరోసారి తమ సమస్యను పరిశీలించాలని రైతులు కోరారు. ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలించి కాలనీ వాసులు, రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అలైన్‌మెంట్‌లో మార్పులు చేసి తమ అభ్యంతరాలను పరిష్కరించే వరకు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని రైతులు స్పష్టం చేశారు. తమ జీవనోపాధికి ఆధారమైన భూములను కాపాడుకోవడంతోపాటు ఇప్పటికే నిర్మాణాలు జరిగిన ప్రాంతాలకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులు కూడా స్పందించి ప్రత్యామ్నాయ మార్గంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో భూముల యజమానులు, రైతులు పాల్గొన్నారు.