భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, విద్యార్థులు చిన్నప్పటి నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి, మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ ఎం. హేమలత సూచించారు. చదువుతోనే మంచి భవిష్యత్తుకు పునాది పడుతుందని, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి సమాజానికి, దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నర్సాపూర్లోని బీసీ సంక్షేమ వసతి గృహంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. చదువుతోపాటు క్రమశిక్షణ, మంచి నడవడికను అలవర్చుకోవాలని చెప్పారు. విద్యార్థి దశ నుంచే మంచి అలవాట్లను పెంపొందించుకుంటే భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం సులభమవుతుందన్నారు.
ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం, చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని హేమలత సూచించారు. ముఖ్యంగా బాలల హక్కుల గురించి తెలుసుకోవడంతోపాటు వాటి ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలన్నారు. తమకు ఉన్న హక్కులు, వాటిని పరిరక్షించుకునే మార్గాలపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. చదువులో రాణించడమే కాకుండా బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగి దేశ అభివృద్ధికి తమ వంతు సేవలందించాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కాట్రోత్ రాజు నాయక్, జాట్రోత్ రవి నాయక్, ఎస్ఐ-2 జగన్నాథం, హాస్టల్ వార్డెన్ సుమన్, లీగల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.