భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండలంలోని నర్సింహుల గూడెం యుపిఎస్లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం కె. పద్మావతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆలపించిన దేశభక్తి గీతాలు, ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తమ ప్రతిభను ప్రదర్శిస్తూ విద్యార్థులు వేడుకల్లో సందడి చేశారు.
ఈ సందర్భంగా హెచ్ఎం పద్మావతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి సమాజ నిర్మాతలని, దేశ భవిష్యత్తుకు వారే పునాది అని తెలిపారు. బాల్య దశలో పిల్లలకు గ్రహణశక్తి, కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ దశలోనే మంచి అలవాట్లు, క్రమశిక్షణ, విద్యపై ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు.
పాఠశాలలో అందుబాటులో ఉన్న విద్యా అవకాశాలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని పద్మావతి కోరారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఏకాగ్రతతో చదువుతూ, నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. చదువులో రాణించడంతోపాటు మంచి నడవడికను అలవర్చుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. తాము చదువుకున్న గ్రామానికి, విద్యనందించిన పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.
బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పాటలు, నృత్యాల కార్యక్రమాలతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బి. శ్రీనివాస్, సుకన్య, వీరేందర్, సంగ శ్రీనివాస్, మమత తదితరులు పాల్గొన్నారు.