భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన

ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన  తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి.

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావాల నేపథ్యంలో రానున్న రోజుల్లో వర్షపాతం తగ్గే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని రైతులు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులు సూచించారు. నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవడంతోపాటు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకుంటూ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుకోవాలని సూచించారు.

నర్సాపూర్ మండలంలోని గూడెంగడ్డ, నాగులపల్లి గ్రామాల్లో శుక్రవారం రైతు రక్షణ కార్యక్రమంలో భాగంగా నీటి సంరక్షణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావాలు, రాబోయే వ్యవసాయ సీజన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించారు. వర్షపాతం తగ్గే పరిస్థితులు ఏర్పడితే పంటల సాగుపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని, అందువల్ల ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపికలో మార్పులు చేసుకోవాలని వివరించారు.

ముఖ్యంగా ఎక్కువ నీరు అవసరమయ్యే వరి సాగును తగ్గించి, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు. జొన్న, మొక్కజొన్న, పెసర, అలసంద, మినుము, శనగ, నువ్వులు, కుసుమ, పొద్దుతిరుగుడు, ఆవాలు, కూరగాయలు వంటి పంటలను సాగు చేయడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. ఆయా పంటల సాగుతో వర్షాభావ పరిస్థితుల్లోనూ వ్యవసాయాన్ని కొనసాగించే అవకాశాలు ఉంటాయని వివరించారు.

ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన  తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి.

వ్యవసాయంలో నీటి పొదుపు కోసం ఆధునిక సాగు పద్ధతులను కూడా రైతులు అందిపుచ్చుకోవాలని అధికారులు సూచించారు. ఆయిల్‌పామ్ సాగుతోపాటు బిందు సేద్యం, తుంపర సేద్యం వంటి పద్ధతులను వినియోగించుకోవాలని తెలిపారు. పంటలకు అవసరమైన మేరకే నీటిని అందించడం ద్వారా వృథాను అరికట్టవచ్చని చెప్పారు. భూగర్భ జలాలు, చెరువులు, ఇతర నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ భవిష్యత్తులో నీటి కొరత సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందేలా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని, మార్కెట్ అవసరాలు, నీటి లభ్యత, నేల స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని సాగు చేపట్టాలని అధికారులు రైతులకు వివరించారు. వాతావరణ మార్పులను ముందుగానే అంచనా వేసుకుని తగిన నిర్ణయాలు తీసుకుంటే పంట నష్టాలను కొంతవరకు తగ్గించుకోవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భారతి, మండల వ్యవసాయ అధికారి దీపిక, మండల పంచాయతీ అధికారి, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు లావణ్య, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.