భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం రత్తిరామ్ తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు గుగులోతు బాలాజీ నాయక్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి దస్రు నాయక్ ఇటీవల మృతి చెందడంతో విషయం తెలుసుకున్న డీసీసీ ప్రెసిడెంట్ డా. ఉమా మురళి నాయక్ శుక్రవారం రత్తిరామ్ తండాకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మానుకోట మున్సిపల్ చైర్మన్ గుగులోతు జ్యోతి రమేష్ నాయక్, మాజీ డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డితో కలిసి దస్రు నాయక్ నివాసానికి చేరుకున్నారు. ముందుగా దస్రు నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాలాజీ నాయక్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. కుటుంబానికి ఎదురైన నష్టాన్ని తట్టుకునే ధైర్యం కలగాలని ఓదార్చి, వారికి మనోధైర్యం కల్పించారు.
ఈ సందర్భంగా డా. ఉమా మురళి నాయక్ మాట్లాడుతూ.. దస్రు నాయక్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబానికి ఇది తీరని లోటని అన్నారు. ఈ కష్ట సమయంలో బాలాజీ నాయక్ కుటుంబం ఒంటరిగా భావించవద్దని, కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన స్థానిక సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులతోపాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు, పలు మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.