భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

పాఠాలు బోధించడం అంత ఈజీ కాదు..

పాఠాలు బోధించడం అంత ఈజీ కాదు..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తరగతి గదిలో నిలబడి తోటి విద్యార్థులకు పాఠాలు చెప్పడం అంత సులభమైన విషయం కాదని, ఉపాధ్యాయులు ప్రతిరోజూ ఎంత కష్టపడతారో స్వయంగా అనుభవించిన తర్వాతే అర్థమైందని స్వయం పాలన దినోత్సవంలో టీచర్లుగా వ్యవహరించిన విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఒక్కరోజు ఉపాధ్యాయుల బాధ్యతలు చేపట్టడంతో వారి పని తీరు, ఎదురయ్యే సవాళ్లు తెలిసివచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంతో ఉపాధ్యాయ వృత్తిపై తమకు మరింత గౌరవం పెరిగిందన్నారు.

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ముందస్తుగా స్వయం పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒక్కరోజు ఉపాధ్యాయులుగా మారి పాఠశాల బాధ్యతలను చేపట్టారు. తరగతి గదుల్లో తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమలోని ప్రతిభను ప్రదర్శించారు. ఉపాధ్యాయుల స్థానంలో నిలబడి తరగతులను నిర్వహించడం ద్వారా కొత్త అనుభూతిని పొందారు.

అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వాణిశ్రీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరోజు టీచర్లుగా వ్యవహరించిన విద్యార్థులు మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఉపాధ్యాయులు తమకు పాఠాలు బోధించేందుకు ఎంత శ్రమిస్తారో ఇప్పుడు ప్రత్యక్షంగా తెలిసిందన్నారు. తరగతిలో విద్యార్థులందరినీ ఒకే విధంగా దృష్టిలో ఉంచుకుని పాఠాలు చెప్పడం, వారిని చదువుపై ఆసక్తి చూపేలా చేయడం అంత సులభం కాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం తమకు మంచి పాఠం నేర్పిందని, ఇకపై ఉపాధ్యాయుల కష్టాన్ని గుర్తించి మరింత గౌరవిస్తామని వెల్లడించారు.

నిజజీవితంలోనూ రాణించాలి: హెచ్ఎం

ఈ సందర్భంగా హెచ్ఎం వాణిశ్రీ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ప్రతిరోజూ పాఠశాలలో ఎదుర్కొనే అనేక ఒడిదొడుకులను విద్యార్థులు ఈరోజు స్వయంగా అనుభవం ద్వారా తెలుసుకున్నారని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో బాధ్యత, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. పాఠశాలలో నేర్చుకున్న విద్యను నిజజీవితంలోనూ ఉపయోగించుకుంటూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులతోపాటు తాము చదువుకున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

స్వయం పాలన దినోత్సవంలో కలెక్టర్‌గా హాసిని, ఆర్జేడీగా పండు, DEOగా సహస్ర, MEOగా, హెచ్ఎంగా అశ్విని వ్యవహరించారు. అలాగే పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టి తరగతులను నిర్వహించారు. కార్యక్రమానికి రవి శేఖర్ రెడ్డి, చలాని న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో నాగరాణి, ఎం. రవి, ఉపాధ్యాయులు కే. సంపత్ రెడ్డి, శ్రీనివాస్, వెంకన్న, సతీష్ బాబు, ఎం. రమేష్, ఏకాంబ్రాచారి, ఎం. రవి, PD ప్రవీణ్, ఫాతిమా, సునీత, CRP వీరస్వామి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.