భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

విజ్ఞాన్ హై స్కూల్‌లో బాలల దినోత్సవ వేడుకలు

విజ్ఞాన్ హై స్కూల్లో  సృజనాత్మక సాంస్కృతిక పోటీలు..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇనుగుర్తి మండల కేంద్రంలోని విజ్ఞాన్ హై స్కూల్‌లో శుక్రవారం విద్యార్థులకు వివిధ రకాల సృజనాత్మక, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ గంజి అర్చన రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అర్చన రెడ్డి మాట్లాడుతూ.. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు పిల్లలంటే ఎంతో ఇష్టమని, ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. ఈ రోజును పురస్కరించుకుని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు పాఠశాలల్లో వివిధ రకాల పోటీలు నిర్వహిస్తామని వివరించారు. చదువుతో పాటు ఇతర రంగాల్లోనూ విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.

విజ్ఞాన్ హై స్కూల్లో  సృజనాత్మక సాంస్కృతిక పోటీలు..

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ పాఠశాలలో ఫ్రూట్స్ డే నిర్వహించారు. జంక్ ఫుడ్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని, అలాంటి ఆహార పదార్థాలను పాఠశాలకు తీసుకురావద్దని విద్యార్థులకు సూచించారు. పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, వాటిలో ఉండే పోషక విలువల గురించి వివరించి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించారు.

ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల సంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యార్థులు చేసిన వేషధారణలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నిర్వహించిన ‘వింత కలయికల పోటీలు’ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల వినూత్న ఆలోచనలు, సృజనాత్మక ప్రదర్శనలు అక్కడున్న వారిని అలరించాయి.

విజ్ఞాన్ హై స్కూల్లో  సృజనాత్మక సాంస్కృతిక పోటీలు..

పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు కొత్త విషయాలను నేర్చుకునేందుకు, తమలోని ప్రతిభను బయటపెట్టేందుకు ఉపయోగపడతాయని పాఠశాల నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వెననగండ్ల చంద్రమోహన్, తోట అనిత, ఉడుత శ్వేత, గుండ్రపల్లి స్రవంతి, కోరుకొండ కావ్యతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.