భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

సీఐఐ సదస్సు విజయవంతం.. ఉద్యోగులకు బాబు ప్రశంసలు..

సీఐఐ సదస్సు విజయవంతం.. ఉద్యోగులకు బాబు ప్రశంసలు..

భార‌త్ స‌మాచార్, అమ‌రావ‌తి : విశాఖపట్నంలో నిర్వహించిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, పోలీసు సిబ్బందిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. సదస్సు నిర్వహణలో వివిధ శాఖల సిబ్బంది చూపిన సమన్వయం, అంకితభావాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. విశాఖలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. భారీ అంతర్జాతీయ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణతో పాటు అర్నబ్, మురసు తుపానుల సమయంలోనూ ఉద్యోగులు ఎంతో బాధ్యతగా పనిచేశారని గుర్తుచేశారు. ప్రకృతి వైపరీత్యాలు, ఎన్నికల విధులు వంటి సవాళ్లను ఎదుర్కొంటూనే సీఐఐ సదస్సు ఏర్పాట్లను సమర్థంగా పూర్తి చేయడం అభినందనీయమన్నారు. దేశవిదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఆకట్టుకునేలా సదస్సు ప్రాంగణాన్ని తీర్చిదిద్దడంలో అధికారులు చూపిన చొరవను ప్రశంసించారు. ఈ స్థాయి కార్యక్రమ నిర్వహణతో ఉద్యోగులు కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పారని పేర్కొన్నారు.

విశాఖ నగరాన్ని పరిశుభ్రంగా, అందంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల కృషి ఎంతో కీలకమని చంద్రబాబు అన్నారు. సదస్సు జరిగిన రోజుల్లో నగరంలో శుభ్రతను కొనసాగించేందుకు నిరంతరం పనిచేసిన కార్మికులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, కొండపల్లి శ్రీనివాస్, డోలా బాల వీరాంజనేయ స్వామి, పి. నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు. కాగా, సదస్సు ముగింపు కార్యక్రమానికి హాజరైన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు ఐఎన్‌ఎస్ డేగా విమానాశ్రయంలో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, మంత్రులు ఘనంగా వీడ్కోలు పలికారు.