భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ పట్టణంలోని గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం (కేజీకేఎస్) రాష్ట్ర కమిటీ సభ్యుడు పచ్చిమట్ల రవీందర్ గౌడ్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను కోరారు. తాటివనం, ఈతవనాలకు వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం లేక కార్మికులు పడుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
హుస్నాబాద్ పట్టణంలోని పొట్లపల్లి రోడ్డు వైపు దామరకుంట సమీపంలో తాటి, ఈత వనాలు ఉన్నాయి. అయితే అక్కడికి వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడంతో గీత కార్మికులు ప్రతిరోజూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రెండేళ్ల క్రితం కట్టకు గండి పడటంతో రాకపోకలకు మరింత సమస్య ఏర్పడిందని రవీందర్ గౌడ్ తెలిపారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోందని, కార్మికులు వనాలకు వెళ్లేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారని వివరించారు.
గీత కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని దామరకుంట వద్ద బ్రిడ్జి నిర్మించాలని, తాటివనం నుంచి గుట్ట కింది ఎల్లమ్మ ఆలయం వరకు సీసీ రోడ్డు వేయాలని కోరారు. ఈ రెండు పనుల కోసం కనీసం రూ.5 కోట్ల నిధులు కేటాయించి పనులు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే దామరకుంట చెరువు కబ్జాలకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, చెరువు హద్దులను కూడా నిర్ణయించాలని కోరారు.
మరోవైపు హుస్నాబాద్ పట్టణంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం కార్యకలాపాల నిర్వహణ కోసం కమిటీ హాల్ నిర్మించాల్సిన అవసరం ఉందని రవీందర్ గౌడ్ తెలిపారు. ఇందుకోసం ఐదు గుంటల స్థలం కేటాయించడంతోపాటు భవన నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు.
గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని, రహదారి, బ్రిడ్జి నిర్మాణంతో పాటు కమిటీ హాల్ ఏర్పాటుకు అవసరమైన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో గీత కార్మికులు పూదరి రాజు, మొలంగూర్ శ్రీనివాస్, కోయడ బాలయ్య, పూదరి మల్లేశం, వడ్లకొండ శ్రీనివాస్, తాళ్లపల్లి రాజయ్య, పచ్చిమట్ల శ్రీనివాస్, బబ్రు రవీందర్, సుధగోని కనకయ్య తదితరులు పాల్గొన్నారు.