భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

మెదక్ జిల్లా సివిల్ డిఫెన్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

మెదక్ జిల్లా సివిల్స్ డిఫెన్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం ఎన్నిక

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ అసోసియేషన్ మెదక్ జిల్లా నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో సభ్యులందరూ ఏకాభిప్రాయంతో కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేశారు.

నూతన కార్యవర్గంలో జిల్లా అధ్యక్షుడిగా నేరెళ్ల నరేష్, ఉపాధ్యక్షుడిగా పి. జనార్దన్ రెడ్డి, జిల్లా కోశాధికారిగా గోపాల్ ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ విపత్తుల నిర్వహణ, అత్యవసర సేవలు, పౌర రక్షణ కార్యక్రమాల్లో సివిల్ డిఫెన్స్ అసోసియేషన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రజలకు అత్యవసర సమయాల్లో అండగా నిలవడంతో పాటు విపత్తుల సమయంలో సమర్థవంతమైన సేవలు అందించడంలో అసోసియేషన్ సభ్యుల బాధ్యత ఎంతో ముఖ్యమని చెప్పారు. మెదక్ జిల్లా నూతన కార్యవర్గం ఈ సేవలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సభ్యులకు నూతన అధ్యక్షుడు నేరెళ్ల నరేష్, ఉపాధ్యక్షుడు పి. జనార్దన్ రెడ్డి, కోశాధికారి గోపాల్ కృతజ్ఞతలు తెలిపారు. సభ్యుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జిల్లాలో అసోసియేషన్‌ను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. అలాగే ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, విపత్తుల నిర్వహణ మరియు పౌర రక్షణ సేవల్లో మరింత చురుగ్గా పనిచేస్తామని స్పష్టం చేశారు.