భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్‌లో శ్రీ వత్సల్ గురుకుల పాఠశాలకు చెందిన స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సు నడుపుతున్న సమయంలో డ్రైవర్ ప్రభాకర్‌కు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో వాహనం అదుపుతప్పి ఫుట్‌పాత్ వైపు దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో ఉన్న 35 మంది విద్యార్థులు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సమాచారం ప్రకారం.. డ్రైవర్ ప్రభాకర్ బస్సును నడుపుతుండగా ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న ఫుట్‌పాత్ వైపు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఫుట్‌పాత్ సమీపంలో పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాదగిరికి చెందిన బైక్ పూర్తిగా ధ్వంసమైంది.
బస్సు దూసుకెళ్లిన ప్రాంతానికి సమీపంలో విద్యుత్ సరఫరా అవుతున్న రెండు ట్రాన్స్‌ఫార్మర్లు ఉండటంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. బస్సు వాటిని ఢీకొట్టి ఉంటే ప్రమాద తీవ్రత మరింత పెరిగేదని స్థానికులు భావిస్తున్నారు. అయితే అదృష్టవశాత్తూ బస్సులో ప్రయాణిస్తున్న 35 మంది విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ ఘటనతో విద్యార్థులు భయంతో ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్‌కు అకస్మాత్తుగా ఫిట్స్ రావడమే ప్రమాదానికి కారణంగా సమాచారం అందుతోంది. విద్యార్థులతో ప్రయాణించే స్కూల్ బస్సుల డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితి, వాహనాల భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.