భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలోని హనుమాన్ నగర్ తండాలో శనివారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ గుగులోతు అశోక్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
ముందుగా భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేసి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నెహ్రూకు పిల్లలపై ఉన్న ప్రత్యేక ప్రేమ, ఆప్యాయత, వారి భవిష్యత్తుపై ఆయన చూపిన శ్రద్ధ గురించి సర్పంచ్ అశోక్ కుమార్ విద్యార్థులకు వివరించారు.
అనంతరం గ్రామంలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వసతులపై సర్పంచ్ ఆరా తీశారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, ఎదురవుతున్న ఇబ్బందుల గురించి సంబంధిత బాధ్యులను అడిగి తెలుసుకున్నారు. వసతుల కొరత ఉంటే వాటిని గుర్తించి పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
విద్యార్థులు తమకు ఎదురవుతున్న సమస్యలను దాచుకోకుండా గ్రామసభలో ధైర్యంగా వివరించాలని అశోక్ కుమార్ కోరారు. విద్యకు సంబంధించిన అవసరాలు, పాఠశాలల్లో ఎదురయ్యే ఇబ్బందులను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. పిల్లలకు మెరుగైన విద్యా వాతావరణం, అవసరమైన సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు, ఉపసర్పంచ్ శ్రీలత యాకు, వార్డు సభ్యులు రజిత, వెంకన్న, లక్పతి, రవి, అంగన్వాడీ టీచర్లు శారద, మైబు, ఆశా వర్కర్ జాటోతు నీల తదితరులు పాల్గొన్నారు.