భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

బాలల హక్కుల పరిరక్షణకు సమిష్టి కృషి చేయాలి

చిన్నముప్పారం-చిన్న నాగారంలలో..  ఘనంగా బాలల దినోత్సవం గ్రామసభలు.

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలోని చిన్నముప్పారం, చిన్ననాగారం గ్రామాల్లో శనివారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామసభలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలల హక్కులు, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత, రక్షణతో పాటు పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

సమిష్టిగా కృషి చేయాలి: సర్పంచ్, MEO

చిన్నముప్పారం గ్రామంలో నిర్వహించిన బాలల గ్రామసభలో సర్పంచ్ రాయలి భవాని శేఖర్, MEO వెన్న వెంకటరెడ్డి మాట్లాడుతూ.. బాలల హక్కులను గౌరవించడంతో పాటు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. పిల్లలు ఏయే రంగాలపై ఆసక్తి చూపిస్తున్నారో గుర్తించి, ఆయా రంగాల్లో ముందుకు వెళ్లేలా వారిని ప్రోత్సహించాలని చెప్పారు.

బాలబాలికల ప్రవర్తన, అభిరుచులను నిరంతరం గమనిస్తూ వారిలో మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించాలని తెలిపారు. అలాగే మంచి నడవడిక, క్రమశిక్షణ వంటి విలువలను చిన్నప్పటి నుంచే అలవాటు చేసేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, AAPC చైర్మన్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

చిన్నముప్పారం-చిన్న నాగారంలలో..  ఘనంగా బాలల దినోత్సవం గ్రామసభలు.

గ్రామసభలు చక్కని వేదిక: చిన్ననాగారం సర్పంచ్

చిన్ననాగారంలో జరిగిన బాలల గ్రామసభలో సర్పంచ్ చెడపాక సుజాత యాకయ్య మాట్లాడుతూ.. పిల్లలే దేశ భవిష్యత్తుకు పునాదులని తెలిపారు. వారి కలలను సాకారం చేసుకునేందుకు నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం, సురక్షితమైన వాతావరణం కల్పించడం ఎంతో ముఖ్యమన్నారు. బాలల సంక్షేమం కోసం గ్రామపంచాయతీ తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

పిల్లల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు బాలల గ్రామసభలు చక్కని వేదికగా ఉపయోగపడతాయని సర్పంచ్ పేర్కొన్నారు. పిల్లలు తమ సమస్యలను స్వేచ్ఛగా వెల్లడించేలా అవకాశం కల్పించాలని, వారి అవసరాలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి పిట్టల శేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్, వార్డు సభ్యులు నిడిగంటి చంద్రమౌళి, ముత్యాల సోమక్క, చెడుపాక నరేష్, చెడుపాక అలివేలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బైరు శ్రీనివాస్, దాసరి ప్రకాష్, కొయ్యడి మల్లయ్య, సెర్ఫ్ సీఏ బైరు శ్రీమతి, అంగన్వాడీ టీచర్లు చెడుపాక శ్రీలత, దాసరి కవిత, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.