భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఆధ్యాత్మిక చింతనతో ప్రతి ఒక్కరిలో మానసిక ప్రశాంతత, సానుకూల ఆలోచనలు పెరుగుతాయని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకుంటూ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగాలని సూచించారు.
చిన్నశంకరంపేట గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ 10వ వార్షికోత్సవ వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో హోమం, పుణ్యవచనం, నవగ్రహ పూజలతో పాటు పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాన్ని భక్తుల సమక్షంలో కన్నుల పండువగా జరిపించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనసుకు ప్రశాంతత కలగడంతో పాటు జీవితంపై సానుకూల దృక్పథం పెరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడుస్తూ ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన అందించేలా పాలకులకు స్వామివారు జ్ఞానోదయం కలిగించాలని ప్రార్థించినట్లు పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. పాలకులు తమ స్వప్రయోజనాల కోసం కాకుండా ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పనిచేసేలా ఆశీర్వదించాలని స్వామివారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవిస్తూ సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నట్లు వెల్లడించారు.
అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. ఈ ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి భక్తితో నీరాజనాలు పలికారు. చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.
వేడుకలకు వచ్చిన భక్తుల కోసం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ 10వ వార్షికోత్సవం, స్వామివారి కల్యాణ మహోత్సవం సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో మాజీ AMC చైర్మన్ గంగా నరేందర్, BRS మండల శాఖ అధ్యక్షుడు రాజు లక్ష్మారెడ్డి, సర్పంచులు చంద్రశేఖర్, నరేష్, నాగభూషణం, భూమయ్య, మాజీ ఎంపీటీసీ హేమా వెంకటేశం, మాజీ సర్పంచులు శ్రీమన్ రెడ్డి, పూలపల్లి యాదగిరి యాదవ్, లక్ష్మణ్, దయానంద యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, ప్రభాకర్, ఉపసర్పంచ్ భాను ప్రసాద్, మాజీ ఉపసర్పంచ్ హేమచంద్రం దుర్గపతి పాల్గొన్నారు. వీరితో పాటు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వివిధ పార్టీల నాయకులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు హాజరయ్యారు.