భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, నవంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

ఘోర రోడ్డు ప్రమాదం.. MBBS విద్యార్థి దుర్మరణం

బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొని యువకుడు మృతి.. మరొకరి పరిస్థితి విషమం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టిన ఘటనలో ఓ MBBS విద్యార్థి దుర్మరణం చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషాద ఘటన చిన్నశంకరంపేట మండల పరిధిలోని మిర్జాపల్లి గ్రామ శివారులో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.

ఎస్సై శివానందం తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిరాకుపల్లి గ్రామానికి చెందిన కరబాసి మహేష్ (25), కొండారి జయవర్ధన్ ఇద్దరూ స్నేహితులు. వీరిద్దరూ సిరిసిల్లలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS నాలుగో సంవత్సరం చదువుతున్నారు. ఈ క్రమంలో పని నిమిత్తం ఇద్దరూ కలిసి బైక్‌పై చిన్నశంకరంపేటకు వచ్చారు. పని ముగించుకుని తిరిగి నార్సింగి వైపు బయలుదేరారు.

ఈ క్రమంలో మార్గమధ్యలో మిర్జాపల్లి గ్రామ శివారుకు చేరుకోగానే వీరు ప్రయాణిస్తున్న బైక్ ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కన ఉన్న చెట్టును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న మహేష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతడి స్నేహితుడు జయవర్ధన్ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు.

బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొని యువకుడు మృతి.. మరొకరి పరిస్థితి విషమం

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు 108 అంబులెన్స్‌ను రప్పించి క్షతగాత్రులను మెదక్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే జయవర్ధన్ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ అతడికి చికిత్స కొనసాగుతోంది.

మహేష్ మృతితో అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. చదువుకుంటూ ఉన్నత స్థాయికి చేరుకోవాల్సిన యువకుడు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో చిరాకుపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మృతుడి తండ్రి జరప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివానందం తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.