భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

గ్రామాభివృద్ధికి కొత్త ఊపు.. తోటపల్లిలో వరుస పనులు

తోటపల్లిలో వి.బి.జి. రామ్‌జీ పథకంతో అభివృద్ధి పనులు

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: వి.బి.జి. రామ్‌జీ పథకం ద్వారా హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పలు పనులు చేపడుతున్నారు. ఈ పథకం కింద పనుల అమలులో తోటపల్లి గ్రామం మండలంలోనే ముందంజలో నిలుస్తోంది.

పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలు, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనల మేరకు గ్రామంలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా పూస వేర్లపల్లి నుంచి సంఘపురం బండ వరకు నిర్మించనున్న పొలం బాట పనులను సోమవారం గ్రామ సర్పంచ్ బంక లక్ష్మీ చందు, ఉపసర్పంచ్ పోలురాజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

ఇప్పటికే గ్రామంలో 68 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 90 రోజుల పనిదినాలు కల్పించారు. అలాగే నిరుపయోగంగా ఉన్న బోరుబావులను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. పశువులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు నీటి తొట్టెల నిర్మాణం కోసం స్థలాలను గుర్తిస్తున్నారు.

గ్రామంలోని నల్లాల బావి నుంచి జనగాం శివారు వరకు రోడ్డు నిర్మాణం, కల్వర్టు నిర్మాణం, పాఠశాల ప్రహరీ గోడ, మహిళా సంఘాల భవనం నిర్మాణంతోపాటు వివిధ ప్రాంతాల్లో పొలం బాటల అభివృద్ధి పనులు కూడా చేపడుతున్నారు. ఈ పనులు పూర్తయితే రైతులకు పొలాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతోపాటు గ్రామ ప్రజలకు అవసరమైన ఇతర మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి.

గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ఫీల్డ్ అసిస్టెంట్ కోటి అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.