భారత్ సమాచార్, మెదక్ జిల్లా: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని బి.వి.రాజు సాంకేతిక విద్యాసంస్థ (బివిఆర్ఐటీ) ఆధ్వర్యంలో నర్సాపూర్లోని విష్ణు ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రంథాలయాల ప్రాముఖ్యత, పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు, విద్యార్థుల జీవితంలో పుస్తకాల పాత్ర గురించి ఈ కార్యక్రమంలో వివరించారు.
ఈ సందర్భంగా కళాశాల సంచాలకులు డాక్టర్ కె. లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో గ్రంథాలయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పాఠ్యపుస్తకాలతో పాటు వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలు చదవడం ద్వారా విజ్ఞానాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. పుస్తక పఠనం కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచడంతోపాటు ఆలోచనా విధానాన్ని మెరుగుపరుస్తుందని చెప్పారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ దూబే మాట్లాడుతూ విద్యార్థుల విద్యా ప్రగతి, విజ్ఞాన సముపార్జన, వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి రోజువారీ జీవితంలో పుస్తక పఠనాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. పుస్తకాలు చదవడం వల్ల చదువుపై ఆసక్తి పెరగడంతోపాటు వివిధ రంగాలపై అవగాహన విస్తరిస్తుందని తెలిపారు.
అనంతరం కళాశాల గ్రంథపాలకులు డాక్టర్ ఎ. మల్లికార్జున గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాలు, విజ్ఞాన వనరులు, గ్రంథాలయ సేవల గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు గ్రంథాలయాలను కేవలం పుస్తకాలు చదివే ప్రదేశాలుగా కాకుండా కొత్త విషయాలను నేర్చుకునే విజ్ఞాన కేంద్రాలుగా వినియోగించుకోవాలని సూచించారు.
విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడం, గ్రంథాలయాల వినియోగంపై అవగాహన కల్పించడం, చదివే అలవాటును ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల నిర్వాహకులు బి. బాపిరాజు, పరిపాలనాధికారి టి.ఎల్.ఎన్. సురేష్ తదితరులు పాల్గొన్నారు.