భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన చేయూత పెన్షన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. BRS నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో కొద్దిసేపు సభా ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. BRS కౌన్సిలర్ మోయిజ్‌ను సభా వేదికపైకి అనుమతించకపోవడమే ఈ వివాదానికి కారణమైంది.
వివరాల్లోకి వెళితే.. నర్సాపూర్ పట్టణంలోని సాయికృష్ణ గార్డెన్లో నూతన చేయూత పెన్షన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. లబ్ధిదారులకు పెన్షన్ల ఉత్తర్వులు అందించే కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో BRS కౌన్సిలర్ మోయిజ్ సభా వేదికపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు.
అయితే పోలీసులు ఆయనను వేదికపైకి అనుమతించకపోవడంతో అక్కడే ఉన్న BRS నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కౌన్సిలర్లను వేదికపైకి అనుమతిస్తూ, BRS కౌన్సిలర్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, BRS నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సభా ప్రాంగణంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నయుముద్దీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ కౌన్సిలర్లను మాత్రమే వేదికపైకి అనుమతించి, BRS కౌన్సిలర్ మోయిజ్‌ను అడ్డుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలచే ఎన్నికైన ప్రజాప్రతినిధులందరికీ సమానమైన ప్రోటోకాల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీల ఆధారంగా ప్రజాప్రతినిధుల పట్ల వివక్ష చూపకూడదని పేర్కొన్నారు.
అయితే వివాదం ముదరడంతో చివరకు పోలీసులు కౌన్సిలర్ మోయిజ్‌ను సభా వేదికపైకి అనుమతించారు. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వేదికపై ఉండగానే ఈ వాగ్వాదం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.