భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

మార్కెట్ యార్డులోనే పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టాలి

మార్కెట్ యార్డులోనే పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టాలి

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: రైతులు పండించిన పత్తి, మొక్కజొన్న పంటలను హుస్నాబాద్ మార్కెట్ యార్డులోనే కొనుగోలు చేసేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని బీఎస్పీ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డులో వేలం పాట విధానంలో కొనుగోళ్లు జరగాల్సి ఉండగా, కొందరు వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా తమ ఇళ్ల వద్ద, అద్దెకు తీసుకున్న షెడ్లలో కొనుగోళ్లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఈ కొనుగోళ్ల విషయంలో మార్కెట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. మార్కెట్ యార్డులోనే వ్యాపారుల మధ్య పోటీ ఉండేలా వేలం పాట విధానంలో కొనుగోళ్లు నిర్వహిస్తే రైతులకు మద్దతు ధర కంటే మెరుగైన ధర లభించే అవకాశం ఉంటుందని తెలిపారు. కానీ బయట ప్రాంతాల్లో ఇష్టానుసారంగా కొనుగోళ్లు జరపడం వల్ల రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.

మరోవైపు పంటల కొనుగోళ్ల సమయంలో తూనికల కొలతల విషయంలోనూ రైతులకు అన్యాయం జరుగుతోందని రవీందర్ గౌడ్ ఆరోపించారు. మట్టి, సంచి బరువు, నగదు కట్టింగ్ పేరుతో రైతుల పంటకు రావాల్సిన డబ్బుల్లో కోతలు విధిస్తున్నారని అన్నారు. ఈ సమస్యలను అరికట్టేందుకు తూనికల కొలతల శాఖ అధికారులు పంటల కొనుగోలు సీజన్ ప్రారంభానికి ముందే ఎలక్ట్రానిక్ కాంటాలను తనిఖీ చేయాలని కోరారు. కొందరు వ్యాపారులు లైసెన్సులు లేకుండానే కొనుగోళ్ల వ్యాపారం నిర్వహిస్తున్నారని, అలాంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే రైతులకు ఈ విధంగా అన్యాయం జరుగుతుండటం విచారకరమని ఆయన అన్నారు. మార్కెట్ యార్డులో కొనుగోళ్లు జరగాల్సిన చోట బయట వ్యాపారాలు కొనసాగుతుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత మార్కెట్ అధికారులపై ఉందని గుర్తుచేశారు.

ఇప్పటికైనా మార్కెట్ కార్యదర్శి వెంటనే స్పందించి పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లన్నీ మార్కెట్ యార్డులోనే జరిగేలా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని పచ్చిమట్ల రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు. రైతులను దోపిడీ చేస్తున్న వ్యాపారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు స్పందించకపోతే బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నాయకులు వెలుపుల రాజు, డేగల వెంకటేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.