భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

ఏబీవీపీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతి

పాఠశాల ఆవరణను చీల్చే రహదారి అలైన్‌మెంట్‌ మార్చాలి

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: నాగసముద్రాల గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఆవరణను రెండుగా విభజించేలా రూపొందించిన రహదారి అలైన్‌మెంట్‌ను వెంటనే మార్చాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. పాఠశాల స్థలాన్ని కాపాడటంతో పాటు విద్యార్థుల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఏబీవీపీ కోహెడ మండల శాఖ ఆధ్వర్యంలో మెదక్ విభాగ్ ఎస్‌ఎఫ్‌డీ కన్వీనర్ రాజేష్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నాగసముద్రాల గ్రామంలోని సర్వే నంబర్ 263లో ఐదు ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ మోడల్ స్కూల్ నిర్మించారని తెలిపారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో సుమారు 800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని పేర్కొన్నారు. అలాంటి విద్యాసంస్థ ఆవరణ మీదుగా రహదారి నిర్మించేలా అలైన్‌మెంట్ రూపొందించడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు.

కొందరి ప్రైవేటు భూములకు రాకపోకల సౌకర్యం కల్పించేందుకే పాఠశాల ఆవరణ మీదుగా రహదారి నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదన అమలైతే పాఠశాలకు సంబంధించిన విలువైన స్థలం కోల్పోవడమే కాకుండా, విద్యార్థుల భద్రతకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

పాఠశాల ప్రాంగణం మధ్యలో నుంచి రహదారి నిర్మిస్తే విద్యార్థుల రాకపోకలకు ఆటంకం కలగడంతోపాటు చదువుకునే వాతావరణం కూడా దెబ్బతింటుందని వివరించారు. వాహనాల రాకపోకల వల్ల చిన్నారుల భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. 800 మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు.

సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి, పాఠశాల స్థలానికి ఎలాంటి నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలించాలని ఏబీవీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భద్రత, విద్యాభ్యాసానికి ఇబ్బందులు కలగకుండా రహదారి అలైన్‌మెంట్‌ను మార్చాలని, పాఠశాల ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు అజయ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Is this conversation helpful so far?