భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: సామాజిక అంశాలపై తమ కవితల ద్వారా చైతన్యం కలిగిస్తున్న ఇనుగుర్తి గ్రామానికి చెందిన ఆధునిక భావకవి శీలం రాజిరెడ్డి, కృష్ణకుమారి దంపతులకు ఆంధ్రప్రదేశ్లో ఘన సన్మానం లభించింది. అమ్మాయిల వస్త్రధారణ, సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పులు, తల్లిదండ్రుల బాధ్యతలు వంటి అంశాలపై వారు రాసి వినిపించిన కవిత ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు కవి దంపతులను ప్రశంసా పత్రాలు, మెమెంటోలతో సత్కరించారు.
శ్రీశ్రీ కళావేదిక, తెలుగు భాషా పరిరక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఆదివారం 'సాహితీ వైభవం' జాతీయ సాహిత్య, సాంస్కృతిక మహోత్సవాన్ని నిర్వహించారు. గురజాడ వెంకట అప్పారావు ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 250 మంది కవులు హాజరయ్యారు. వివిధ సామాజిక అంశాలను తమ రచనల ద్వారా ప్రస్తావిస్తూ కవితా పఠనం చేశారు.
ఈ మహోత్సవంలో మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన శీలం రాజిరెడ్డి, కృష్ణకుమారి దంపతులు పాల్గొన్నారు. అమ్మాయిల వస్త్రధారణ విషయంలో సమాజంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, వాటిపై తల్లిదండ్రుల బాధ్యతలు, స్వేచ్ఛ పేరుతో మారుతున్న ఆలోచనా విధానాలను ప్రస్తావిస్తూ తమ కవితను వినిపించారు.
ముఖ్యంగా యువతలో వస్త్రధారణపై పెరుగుతున్న పోటీ ధోరణి, సంప్రదాయాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆత్మగౌరవం వంటి అంశాలను ప్రశ్నిస్తూ కవిత సాగింది. అలాగే సమాజంలో కొత్తగా పెరుగుతున్న OYO రూముల సంస్కృతిపై కూడా వారు తమ రచనలో విమర్శనాత్మకంగా స్పందించారు. సామాజిక బాధ్యతను గుర్తుచేస్తూ సాగిన ఈ కవితా పఠనానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సభలో పాల్గొన్నవారు ఆసక్తిగా వింటూ చప్పట్లతో అభినందించారు.
కవితలోని భావాలు, సామాజిక అంశాల ప్రస్తావనకు స్పందించిన శ్రీశ్రీ కళావేదిక, తెలుగు భాషా పరిరక్షణ సమితి నిర్వాహకులు శీలం రాజిరెడ్డి, కృష్ణకుమారి దంపతులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేయడంతోపాటు పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షులు కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరీభూషణం, ప్రధాన కార్యదర్శి పార్ధసారథి, విజయనగరం జిల్లా శ్రీశ్రీ కళావేదిక కార్యవర్గ సభ్యులు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు.
ఇనుగుర్తి నుంచి వెళ్లి జాతీయ స్థాయి సాహిత్య వేదికపై తమ కవితలతో గుర్తింపు పొందడంతో శీలం రాజిరెడ్డి, కృష్ణకుమారి దంపతులకు పలువురు అభినందనలు తెలియజేశారు.