భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అర్హులైన పేదలందరికీ చేయూత పింఛన్లు అందించి ఆర్థికంగా అండగా నిలవడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని కార్మిక ఉపాధి, గనులు, భూగర్భ శాఖ మంత్రి, మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు అవసరమైన పథకాలను అమలు చేస్తోందని చెప్పారు.
సోమవారం నర్సాపూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో చేయూత పింఛన్ లబ్ధిదారులకు మంత్రి వివేక్ వెంకటస్వామి పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు. నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 3,775 మంది లబ్ధిదారులకు పింఛన్లు మంజూరైనట్లు మంత్రి వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటోందని వివరించారు. చేయూత పింఛన్లు నిరుపేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, వారి జీవనానికి ఆర్థిక అండగా నిలుస్తాయని పేర్కొన్నారు.
నర్సాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాలు, మున్సిపాలిటీ పరిధిలో లబ్ధిదారుల వివరాలను మంత్రి వెల్లడించారు. చిలిపిచేడ్ మండలంలో 364 మంది, కౌడిపల్లి మండలంలో 598 మంది, కుల్చారం మండలంలో 548 మంది, మాసాయిపేట మండలంలో 263 మంది, నర్సాపూర్ మండలంలో 555 మంది, నర్సాపూర్ మున్సిపాలిటీలో 244 మంది, శివంపేట మండలంలో 720 మంది, వెల్దుర్తి మండలంలో 483 మంది లబ్ధిదారులకు పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు.
మంజూరైన లబ్ధిదారుల్లో 128 మంది కల్లుగీత కార్మికులు, 602 మంది దివ్యాంగులు, 2,635 మంది వితంతువులు, 366 మంది ఒంటరి మహిళలు ఉన్నారని మంత్రి వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, పింఛన్ల ద్వారా పేద కుటుంబాలకు నిరంతర ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గురించి కూడా మంత్రి వివరిస్తూ.. ఇళ్ల నిర్మాణం బేస్మెంట్ స్థాయికి చేరుకున్న తర్వాత ప్రభుత్వం నిర్ణయించిన విధంగా విడతల వారీగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో బిల్లుల చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. నిరుపేద కుటుంబాలు సొంతంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుగా బ్యాంకులు రుణాలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదల అభ్యున్నతికి కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వివిధ కార్పొరేషన్ల ద్వారా కార్లు, ట్రాక్టర్లు పొందిన అర్హులైన వారికి కూడా పింఛన్లు అందించాలని కోరారు. అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో DRDO శ్రీనివాస్ రావు, RDO రామకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ రాజు యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.