భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

నెల్లికుదురు ప్రజావాణికి 7 దరఖాస్తులు

నెల్లికుదురు ప్రజావాణి కి 7 దరఖాస్తులు..                               ఎంపీడీవో కుమార్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మండల స్థాయిలో ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం నెల్లికుదురు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి మొత్తం 7 దరఖాస్తులు అందాయి.

ఈ కార్యక్రమానికి ఎంపీడీవో సింగారపు కుమార్, స్థానిక తహసీల్దార్ చంద నరేష్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన 28 మంది అధికారులు హాజరయ్యారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారులకు వివరించి వినతిపత్రాలు సమర్పించారు. అధికారులు ఆయా దరఖాస్తులను స్వీకరించి సంబంధిత శాఖల పరిధిలోని సమస్యల వివరాలను నమోదు చేసుకున్నారు.

అనంతరం ఎంపీడీవో సింగారపు కుమార్ మాట్లాడుతూ.. ప్రజావాణికి మండల వ్యాప్తంగా మొత్తం 7 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. వీటిలో రెవెన్యూ సమస్యలకు సంబంధించి 3, హౌసింగ్‌కు సంబంధించి 2, విద్యుత్ సమస్యపై 1, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించి 1 దరఖాస్తు వచ్చినట్లు తెలిపారు.

ప్రజల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందేందుకు ప్రజావాణి మంచి వేదికగా ఉపయోగపడుతుందని ఎంపీడీవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు హాజరవుతున్నందున ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారులకు వివరించే అవకాశం ఉంటుందని చెప్పారు. మండల కేంద్రంతో పాటు పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రజావాణిని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.