భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

కరెంట్‌షాక్‌తో ఆవు మృతి

విద్యుత్‌షాక్‌తో ఆవు మృతి

భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: విద్యుత్‌షాక్‌కు గురై ఓ పాడి ఆవు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన వలిగొండ మండలం వెలువర్తి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మందుల కృష్ణకు ఈ ఘటనతో తీవ్ర నష్టం వాటిల్లింది. కుటుంబానికి ఆదాయ వనరుగా ఉన్న పాడి ఆవును కోల్పోవడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. సోమవారం ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో మందుల కృష్ణకు చెందిన ఆవు గ్రామ శివారులోని పులిగిల్ల రవీందర్‌రెడ్డి బావి సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు కట్టివేయబడి ఉంది. ఈ క్రమంలో ఆవు విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.

మృతి చెందిన ఆవు విలువ సుమారు ₹.లక్ష ఉంటుందని యజమాని కృష్ణ తెలిపారు. ఆవు రోజుకు దాదాపు ఎనిమిది లీటర్ల పాలు ఇచ్చేదని చెప్పారు. పాలు అమ్ముకోవడం ద్వారా తమ కుటుంబానికి ఆదాయం సమకూరేదని, ఇప్పుడు ఆవును కోల్పోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కష్టపడి పెంచుకున్న పాడి పశువు విద్యుత్‌షాక్‌తో మృతి చెందడం తమ కుటుంబానికి తీరని నష్టమని కృష్ణ వాపోయారు. ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించి తమకు తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.