భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నార్సింగి మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని మాజీ ZPTC బాణాపురం కృష్ణారెడ్డి తెలిపారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో గ్రామాల్లో రోడ్లు, సీసీ రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సోమవారం నార్సింగి మండల పరిధిలోని పెద్ద తండా ప్రధాన రహదారి నిర్మాణ పనులను ₹.20 లక్షల ఉపాధి హామీ (MNREGA) నిధులతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ZPTC బాణాపురం కృష్ణారెడ్డి పాల్గొని రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని గ్రామాల అభివృద్ధిపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఆయన సహకారంతో మరిన్ని నిధులు మంజూరు చేయించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
పెద్ద తండా ప్రధాన రహదారి పనుల ప్రారంభ కార్యక్రమానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరుకావాల్సి ఉన్నప్పటికీ, మంత్రి కార్యక్రమంలో పాల్గొనాల్సి రావడంతో రాలేకపోయారని కృష్ణారెడ్డి వివరించారు. రోడ్డు నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
అదేవిధంగా చిన్న తండాలో బీటీ రోడ్డు నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయని కృష్ణారెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు చెప్పారు. రోడ్డు పనులు పూర్తయితే గ్రామ ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే సహకారంతో మండల వ్యాప్తంగా V.O. భవనాలు, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని కృష్ణారెడ్డి తెలిపారు. గ్రామాల సర్పంచుల సహకారంతో ఇప్పటికే చేపట్టిన పనులను పూర్తి చేయడంతో పాటు, త్వరలో మరిన్ని అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు.
నార్సింగి మండలంలోని ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, మండల సమగ్ర అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ద్వారా మరిన్ని నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు దుషాని ఛత్రియా నాయక్, ఆకుల సుజాత, జగన్ మోహన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల మల్లేశ్ గౌడ్, BRS పార్టీ మండల ప్రధాన కార్యదర్శి భూపతి రాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు బాషా నాయక్, మాజీ సర్పంచ్ ఛత్రియా నాయక్, మాజీ ఉపసర్పంచ్ యోగి, నాయకులు ఓంప్రకాష్ యాదవ్, గణేష్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు.