భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన 338 మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయని ఎంపీడీవో బండారి పార్థసారధి తెలిపారు. ఈ నెల 17న స్థానిక ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్ పత్రాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
మండల కేంద్రం ఇనుగుర్తితో పాటు వివిధ గ్రామాలకు చెందిన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు తదితర వర్గాలకు చెందిన వారికి ఈ పింఛన్లు మంజూరయ్యాయని ఎంపీడీవో వివరించారు. కొత్తగా పింఛన్లు మంజూరు కావడంతో అర్హులైన లబ్ధిదారులకు ఆర్థికంగా కొంత భరోసా లభించనుంది.
ఈ నెల 17న ఉదయం 7.30 గంటలకు ఇనుగుర్తిలోని స్థానిక రైతు వేదికలో పింఛన్ల పంపిణీ ప్రారంభ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ ఈ కార్యక్రమానికి హాజరై లబ్ధిదారులకు పింఛన్ పత్రాలు అందజేయనున్నారని చెప్పారు.
కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులు సమయానికి హాజరుకావాలని ఎంపీడీవో బండారి పార్థసారధి సూచించారు. ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.