భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

KCR కోసం ఏడుపాయల నుంచి ఎర్రవల్లికి పాదయాత్ర

KCR మళ్ళీ సీఎం కావాలని అందె కొండల్ రెడ్డి, కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పాదయాత్ర

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణలో మరోసారి BRS ప్రభుత్వం అధికారంలోకి రావాలని, పార్టీ అధినేత కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ నాయకులు ప్రత్యేక పాదయాత్ర చేపట్టారు. మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వనదుర్గ భవానీ అమ్మవారి ఆలయం నుంచి ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం వరకు ఈ యాత్రను ప్రారంభించారు.

కల్వకుంట సర్పంచ్ అందె కొండల్ రెడ్డి, శంకరంపేట మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. యాత్ర ప్రారంభానికి ముందు నాయకులు, కార్యకర్తలు ఏడుపాయల వనదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనకు ఉండాలని ప్రార్థించారు. అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని కేసీఆర్‌కు అందజేయాలనే సంకల్పంతో భక్తిశ్రద్ధల మధ్య ఏడుపాయల నుంచి ఎర్రవల్లికి పాదయాత్ర ప్రారంభించారు.

ఈ సందర్భంగా అందె కొండల్ రెడ్డి, కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి పదేళ్ల పాలన వరకు కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి సాధించిందని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా రైతులు, పేదలు, వివిధ వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయని చెప్పారు.

KCR మళ్ళీ సీఎం కావాలని అందె కొండల్ రెడ్డి, కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పాదయాత్ర

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారు విమర్శలు చేశారు. తెలంగాణ మళ్లీ అభివృద్ధి, సంక్షేమ పథంలో ముందుకు సాగాలంటే BRS ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ లక్ష్యంతోనే అమ్మవారి ఆశీస్సులు తీసుకుని పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు.

అనంతరం ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ బాలగౌడ్ మాట్లాడుతూ.. వనదుర్గమ్మ అమ్మవారి కృపాకటాక్షాలతో కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, BRS ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు.

ఏడుపాయల నుంచి ఎర్రవల్లి వరకు చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని, యాత్రలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిపై వనదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు బాలగౌడ్ తెలిపారు. కేసీఆర్‌తో పాటు తెలంగాణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో శంకరంపేట-ఆర్ మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, రజక్‌పల్లి సర్పంచ్ కనకరాజు, BRSV నియోజకవర్గ నాయకులు గంజి నవీన్ శ్రీనివాస్, మావురం రాజు, నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన నాయకులు వినయ్, ప్రవీణ్, సల్మాన్, నగేష్, అంతేలి నాగరాజు, కనుక రాజు, స్వామి, రాజు, శేఖర్, శ్రీకాంత్, సాయి, నరేష్, లక్ష్మణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.