భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలోని అర్హులైన పేదలకు ప్రభుత్వం కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు చేసింది. మండలానికి మొత్తం 338 కొత్త పింఛన్లు మంజూరైనట్లు ఎంపీడీవో బండారి పార్థసారధి తెలిపారు. ఈ పింఛన్ల పంపిణీ ప్రారంభ కార్యక్రమాన్ని ఈ నెల 17వ తేదీ మంగళవారం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
మండల కేంద్రం ఇనుగుర్తితో పాటు వివిధ గ్రామాలకు చెందిన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు తదితరులకు కొత్త పింఛన్లు మంజూరయ్యాయని ఎంపీడీవో పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పింఛన్ల ద్వారా ఆర్థికంగా చేయూత అందనుంది.
మంగళవారం ఉదయం 7.30 గంటలకు ఇనుగుర్తి మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో పింఛన్ల పంపిణీ ప్రారంభ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీని ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రజాప్రతినిధులు, కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులు సమయానికి హాజరుకావాలని ఎంపీడీవో బండారి పార్థసారధి సూచించారు. ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.