భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరగా పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి వారం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే ఇనుగుర్తి మండలంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఒక్క దరఖాస్తు కూడా అందలేదు. దీంతో ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు వచ్చిన అధికారులు దరఖాస్తుల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.
మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో ఎంపీడీవో బండారి పార్థసారధితో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఫిర్యాదులు అందజేస్తారని అధికారులు ఎదురుచూసినప్పటికీ, ఎవరూ రాకపోవడంతో కార్యక్రమం వినతులు లేకుండానే ముగిసింది.
అయితే ప్రజావాణికి దరఖాస్తులు రాకపోవడానికి కారణాలపై స్థానికంగా పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజంగానే గ్రామాల్లో ప్రజా సమస్యలు తగ్గిపోయాయా? గతంలో ప్రజావాణిలో అందజేసిన ఫిర్యాదులు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు ఆసక్తి చూపడం లేదా? లేక మండల కేంద్రంలో ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం వల్ల స్పందించడం లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం సద్వినియోగం కావాలంటే గ్రామస్థాయిలో దీనిపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ముందుకు రావడంతో పాటు, గతంలో అందిన ఫిర్యాదుల పరిష్కారంపై కూడా అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.