భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

రోస్టర్ విధానం మార్చాలి.. మంత్రి పొన్నంకు మాల జేఏసీ వినతి

మాలల రోస్టర్ పాయింట్‌లో అన్యాయం సవరించాలి... జిల్లా మాల జేఏసి

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ఎస్సీ వర్గీకరణలో భాగంగా అమలు చేస్తున్న రోస్టర్ విధానంలో మాల, మాల ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని సవరించాలని మాల జేఏసీ జిల్లా చైర్మన్ ఆస లక్ష్మణ్ కోరారు. ప్రతి 10 రోస్టర్ పాయింట్లకు ఒక అవకాశం కల్పించేలా విధానంలో మార్పులు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా మాల జేఏసీ నాయకులు రాష్ట్ర వర్గీకరణ ఉపసంఘం సభ్యుడు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆస లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జరగలేదని, గ్రూపుల వారీగా కేటాయింపులు చేసేటప్పుడు సరైన అనుభావిక గణాంకాలను పరిగణనలోకి తీసుకోలేదని నాయకులు అభిప్రాయపడ్డారు. తగిన గణాంకాల ఆధారాలు లేకుండానే రోస్టర్ విధానాన్ని అమలు చేయడం వల్ల గ్రూప్-3లో ఉన్న మాల, మాల ఉపకులాల విద్యార్థులు, ఉద్యోగులు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

మాలల రోస్టర్ పాయింట్‌లో అన్యాయం సవరించాలి... జిల్లా మాల జేఏసి

ప్రస్తుతం అమలు చేస్తున్న రోస్టర్ విధానంలో 22వ పాయింట్ నుంచి కాకుండా, పది రోస్టర్ పాయింట్లలోపే ఒక అవకాశం కల్పించేలా మార్పులు చేయాలని కోరారు. ప్రతి పది రోస్టర్ పాయింట్లకు ఒక అవకాశం వచ్చే విధంగా విధానాన్ని సవరించాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల మాల, మాల ఉపకులాలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో న్యాయమైన అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

ఎస్సీ వర్గీకరణ ఉపసంఘంలో సభ్యుడిగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమస్యను పరిశీలించి, మాలలకు న్యాయమైన వాటా కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆస లక్ష్మణ్ కోరారు. రోస్టర్ విధానంలో ఉన్న సమస్యలను పరిష్కరించి, తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మాల జేఏసీ జిల్లా నాయకులు ఆస బాబు, పార్థసారథి, బిక్షపతి, పల్లెటూరు ప్రసాద్, పాల శంకర్, రామకృష్ణ, పత్రి యాదగిరి, నర్సింగరావు, వెన్నరాజు, అరె కిషోర్, దండ్రు సుమన్, సుంకే రమేష్, జాల శ్రీనివాస్, ద్యాగల సతీష్, రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.