భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

33 ఏళ్లుగా మంచానికే పరిమితం.. మాజీ సర్పంచ్ కన్నీటి గాథ

33 ఏళ్లుగా నక్సల్స్ దాడి బాధితుడిగా నరకయాతన..!

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: నక్సల్స్ దాడిలో తీవ్రంగా గాయపడి 33 ఏళ్లుగా మంచానికే పరిమితమైన ఓ మాజీ సర్పంచ్ తన కుటుంబాన్ని ఆదుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను వేడుకున్నారు. తన కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతోపాటు, జీవితాంతం అవసరమైన మందులను ఉచితంగా అందించేలా సహాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు. బాధితుడి పరిస్థితిని గమనించిన బండి సంజయ్ స్వయంగా కార్యాలయం నుంచి బయటకు వచ్చి ఆయనను పరామర్శించారు.

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం నందారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి తన భార్యతో కలిసి మంగళవారం ఉదయం ఆటోలో కరీంనగర్‌లోని జిల్లా కేంద్రంలోని ఎంపీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఆయన ఆటో నుంచి కూడా దిగలేని పరిస్థితిలో ఉండటాన్ని గమనించిన బండి సంజయ్ వెంటనే కార్యాలయం నుంచి బయటకు వచ్చి ఆయన వద్దకు వెళ్లారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామర్శించారు.

33 ఏళ్లుగా నక్సల్స్ దాడి బాధితుడిగా నరకయాతన..!

ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి తనకు ఎదురైన కష్టాలను వినతిపత్రం ద్వారా కేంద్ర మంత్రికి వివరించారు. 33 ఏళ్ల క్రితం తాను సర్పంచ్‌గా ఉన్న సమయంలో పోలీసులకు సమాచారం అందిస్తున్నారనే అనుమానంతో నక్సల్స్ తనను పట్టుకుని చేతులు కట్టేసి చిత్రహింసలకు గురిచేశారని తెలిపారు. అనంతరం తనపై కాల్పులు జరిపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో తన నడుము విరిగిపోయిందని, నడుము నుంచి కాళ్ల వరకు స్పర్శ కోల్పోయానని చెప్పారు. నక్సల్స్ కాల్చిన తూటా ఇప్పటికీ తన శరీరంలోనే ఉందని కన్నీటిపర్యంతమయ్యారు.

కాల్పుల ఘటన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మలమూత్ర విసర్జన కూడా స్వయంగా చేసుకోలేని దుస్థితిలో 33 ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యానని తెలిపారు. ప్రతిరోజూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ కుటుంబ సభ్యులపై ఆధారపడి జీవిస్తున్నానని తన బాధను వివరించారు.

33 ఏళ్లుగా నక్సల్స్ దాడి బాధితుడిగా నరకయాతన..!

వైద్యుల సూచనల ప్రకారం జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుందని, అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో వైద్య ఖర్చులు భరించడం కష్టంగా మారిందని చెప్పారు. మందుల కొనుగోలుకు కూడా ఇబ్బందులు పడుతున్నానని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

తన కుమార్తె ఎంఎస్సీ, బీఈడీ పూర్తి చేసిందని, ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తే కుటుంబానికి ఆర్థికంగా అండ లభిస్తుందని శ్రీనివాసరెడ్డి కోరారు. అలాగే తాను జీవించినంతకాలం అవసరమైన మందులను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని ఆదుకోవాలని కేంద్ర మంత్రిని వేడుకున్నారు.

శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తిపై బండి సంజయ్ సానుకూలంగా స్పందించారు. బాధిత కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం జరిగేలా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 33 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ సర్పంచ్ కుటుంబానికి అవసరమైన సహాయం అందించే అంశాన్ని పరిశీలిస్తానని భరోసా ఇచ్చారు.