భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ తెలిపారు. ఇనుగుర్తి మండల కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో త్వరలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. స్థానిక సర్పంచ్ తమ్మడపల్లి కుమార్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలతో పాటు గీత, చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్లతో పాటు ఇతర సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఇనుగుర్తి మండలానికి 334 కొత్త పెన్షన్లు
ఇనుగుర్తి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన 334 మంది అర్హులకు ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ మేరకు లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వుల పత్రాలను అందజేశారు. పెన్షన్లు అందుకోవడానికి అర్హులైన వారు ఎవరూ ఇబ్బందులు పడకుండా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
త్వరలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు
ఇనుగుర్తి మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని, త్వరలోనే మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే మురళి నాయక్ వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఈ పాఠశాల ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే ఇనుగుర్తి పట్టణాన్ని మరింత అందంగా, అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఈ అభివృద్ధి పనులకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుంకరి శ్రీనివాసులు, స్పెషల్ ఆఫీసర్, DRDA జిల్లా అదనపు అధికారి మల్లేశ్వరి, MPDO బండారు పార్థసారథి, మెడికల్ ఆఫీసర్ డా. సురేష్, దిశ సభ్యుడు బాబురావు, AMC డైరెక్టర్ కొట్టం రాము, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్, సర్పంచులు, ఉప సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ జిల్లా, మండల, గ్రామ నాయకులు, పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.