భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్, ఎంపీ పోరిక బలరాం నాయక్ తెలిపారు. పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. మండల కేంద్రం నెల్లికుదురులో కొత్తగా మంజూరైన చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్, ఎంపీ పోరిక బలరాం నాయక్ పాల్గొని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు.
స్థానిక సర్పంచ్ పులి వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే, ఎంపీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే సన్నబియ్యం పంపిణీ, రేషన్ కార్డుల మంజూరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీ, గృహాలకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. వీటితో పాటు అర్హులైన వారికి సామాజిక భద్రతా పెన్షన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు.
మండలంలో 682 మందికి చేయూత పెన్షన్లు
నెల్లికుదురు మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 682 మందికి ప్రభుత్వం కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీ చేతుల మీదుగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర సంక్షేమ పథకాలు కూడా అందేలా కృషి చేస్తామని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతర అర్హులైన వర్గాలకు పెన్షన్లు ఆర్థిక భరోసాగా నిలుస్తాయని చెప్పారు.
నవంబర్ 19 నుంచి కుటుంబ బీమా పథకం
ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19 నుంచి రాష్ట్రంలో కుటుంబ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ తెలిపారు. కుటుంబంలో ఎవరైనా దురదృష్టవశాత్తూ ఏ కారణంతోనైనా మరణిస్తే, ఆ కుటుంబానికి ₹.5 లక్షల బీమా సొమ్ము అందజేయనున్నట్లు వివరించారు. ప్రతి కుటుంబం తరఫున బీమా కోసం అవసరమైన ప్రీమియం మొత్తాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఆపద సమయంలో కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చందా నరేష్, ప్రత్యేకాధికారి మరియన్న, MPDO సింగారపు కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎదల ఎదల్ల యాదవ రెడ్డి, సర్పంచులు, ఉప సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, గ్రామ నాయకులు, పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.