భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: BRS పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ కెప్టెన్ వొడితల లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలను హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. హుస్నాబాద్ నియోజకవర్గ BRS లీగల్ సెల్ కన్వీనర్, మాజీ ఏజీపీ కన్నోజు రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, BRS నాయకులు పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా కన్నోజు రామకృష్ణ మాట్లాడుతూ.. కెప్టెన్ లక్ష్మీకాంతరావు సైనికుడిగా దేశానికి సేవలందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. 1965 భారత్-పాకిస్థాన్ యుద్ధ సమయంలో భారత సైన్యంలో కెప్టెన్‌గా పనిచేసి దేశ రక్షణలో తన వంతు పాత్ర పోషించారని గుర్తు చేశారు. సైనికుడిగా దేశానికి సేవ చేసిన ఆయన, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రజా సేవకే ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.
BRS పార్టీలో సీనియర్ నాయకుడిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పార్టీ అధినేత కేసీఆర్‌కు అండగా నిలిచారని రామకృష్ణ పేర్కొన్నారు. సింగాపూర్ గ్రామ సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, ఎమ్మెల్యే, మంత్రి, రాజ్యసభ సభ్యుడిగా వివిధ హోదాల్లో ప్రజలకు సేవలందించారని వివరించారు. ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలతో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నారని చెప్పారు.
వొడితల కుటుంబం ప్రజా సేవకు, పేదల సంక్షేమానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తోందని కన్నోజు రామకృష్ణ అన్నారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు తనయుడు వొడితల సతీష్‌కుమార్ సైతం హుస్నాబాద్ ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎన్నికై నియోజకవర్గ ప్రజలకు సేవలందించారని గుర్తు చేశారు. ప్రజల అభిమానం, ఆశీర్వాదాలతో వొడితల కుటుంబం మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు డి. ప్రవీణ్, జాల జ్యోతికుమార్, కే. దేవేందర్, ఎం. ఏసుదాస్, జుమ్లా నాయక్, యాల్ల సూర్యప్రకాష్ రెడ్డి, జి. రఘువీర్, పార్నంది ప్రవీణ్, విశ్వతేజ, ఆంజనేయులు, ఎం. సాయి, తిరుపతి నాయక్, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.