భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు: BJP

యంగ్ ఇండియా స్కూల్ సమీపంలో మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట పట్టణంలోని యంగ్ ఇండియా స్కూల్‌కు కేవలం 200 మీటర్ల దూరంలో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతిస్తూ టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడంపై BJP నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, సమీప ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణానికి ముప్పు కలిగించేలా ఉన్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రామాయంపేట పట్టణంలోని సర్వే నంబర్ 1421లో మైనింగ్‌కు సంబంధించిన అనుమతులు, టెండర్ ప్రక్రియను నిలిపివేసి రద్దు చేయాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా BJP నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుకునే పాఠశాలకు ఇంత దగ్గరలో మైనింగ్ కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పాఠశాలకు కేవలం 200 మీటర్ల దూరంలోనే మైనింగ్ నిర్వహిస్తే విద్యార్థులు, ఉపాధ్యాయులు, సమీప ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

యంగ్ ఇండియా స్కూల్ సమీపంలో మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి

మైనింగ్ కార్యకలాపాల వల్ల పెద్ద ఎత్తున దుమ్ము, ధూళి వెలువడటంతో పాటు భారీ వాహనాల రాకపోకలు పెరుగుతాయని, శబ్ద కాలుష్యం కూడా ఏర్పడుతుందని తెలిపారు. ఒకవేళ పేలుళ్లతో కూడిన మైనింగ్ నిర్వహిస్తే పాఠశాల విద్యార్థుల ఆరోగ్యానికి, చుట్టుపక్కల నివసించే ప్రజల భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో విద్యను అభ్యసించాల్సిన పాఠశాల సమీపంలో ఇలాంటి కార్యకలాపాలు చేపట్టడం విద్యార్థుల చదువుపై ప్రభావం చూపడమే కాకుండా వారి భవిష్యత్తుకు విఘాతం కలిగిస్తుందని అన్నారు.

ప్రజల ఆరోగ్యం, విద్యార్థుల భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని BJP నాయకులు కోరారు. సర్వే నంబర్ 1421లో మైనింగ్‌కు ఇచ్చిన అనుమతులపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు జారీ చేసినట్లు తేలితే వాటిని రద్దు చేయడంతో పాటు టెండర్ ప్రక్రియను కూడా నిలిపివేయాలని స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి మైనింగ్ కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వడం సరికాదని, విద్యార్థుల భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు.

ఈ కార్యక్రమంలో BJP రామాయంపేట పట్టణ అధ్యక్షుడు శీలం అవినాష్ రెడ్డి, మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు, అక్కన్నపేట మాజీ ఎంపీటీసీ సిద్ధ రాములు, దంతపల్లి సర్పంచ్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మస్కూరు బాలరాజ్, అక్కన్నపేట సర్పంచ్ యాదగిరి, రాయిలాపూర్ ఉపసర్పంచ్ ప్రశాంత్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల శేఖర్, పట్టణ మాజీ అధ్యక్షుడు భాను, పట్టణ ప్రధాన కార్యదర్శులు అక్కల అనిల్, ప్రవీణ్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మెంగర్తి రంగయ్య, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి కటికే కార్తీక్, యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు కన్నయ్య, కిసాన్ మోర్చా అధ్యక్షుడు నాగరాజు, సంతోష్, యువ మోర్చా నాయకులు అనిల్, సందీప్, మండల ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, మండల ప్రధాన కార్యదర్శులు నాగరాజు, దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.