భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అస్మిత ఖేలో ఇండియా వుషు ఛాంపియన్షిప్ పోటీల్లో నెల్లికుదురు PM శ్రీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచారు. తమ క్రీడా నైపుణ్యంతో ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తూ మొత్తం ఆరు పతకాలు సాధించారు. ఇందులో మూడు బంగారు, రెండు వెండి, ఒక కాంస్య పతకం ఉన్నాయి. గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థినులు జిల్లా స్థాయి పోటీల్లో ఈ స్థాయిలో రాణించడంతో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అస్మిత ఖేలో ఇండియా వుషు గర్ల్స్ అండ్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ పోటీలు ఆదివారం వరంగల్ జిల్లా కేంద్రంలోని సిటీ స్టేడియంలో నిర్వహించారు. ఈ పోటీల్లో నెల్లికుదురు PM శ్రీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల విద్యార్థినులు పాల్గొని వివిధ విభాగాల్లో తమ ప్రతిభను చాటుకున్నారు.
తావోలు విభాగంలోని తైచిక్వాన్ పోటీల్లో జి. కాంక్ష బంగారు పతకం సాధించింది. నాన్కావాన్ విభాగంలో టి. లాస్య బంగారు పతకాన్ని కైవసం చేసుకోగా, వి. దివిజ వెండి పతకాన్ని గెలుచుకుంది. జియాన్ షూ విభాగంలో ఎం.డి. రిమ్శా నాజ్ కాంస్య పతకంతో మెరిసింది. సాండా విభాగంలో బి. అంకిత 45 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించగా, బి. కావ్య 56 కిలోల విభాగంలో వెండి పతకాన్ని దక్కించుకుంది. ఇలా మొత్తం ఆరు పతకాలతో విద్యార్థినులు పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు.
విజేతలకు, కోచ్‌కు ఘన సన్మానం
వుషు పోటీల్లో పతకాలు సాధించిన విద్యార్థినులతో పాటు వారికి శిక్షణ ఇచ్చిన కోచ్ ఆయేషా తస్నీమును మంగళవారం పాఠశాల ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు, అధ్యాపక బృందం ఘనంగా సన్మానించారు. విద్యార్థినుల విజయాన్ని అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థినులు క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచి ఆరు పతకాలు సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ విజయం మహబూబాబాద్ జిల్లాతో పాటు నెల్లికుదురు మండలానికి, తమ పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. విజేతలుగా నిలిచిన విద్యార్థినులతో పాటు వారికి శిక్షణ అందించిన కోచ్ ఆయేషా తస్నీమును ప్రత్యేకంగా అభినందించారు.
విద్యార్థినులు భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. చదువుతో పాటు క్రీడలపై కూడా దృష్టి పెడితే మంచి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని, విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ విజయంతో ఇతర విద్యార్థుల్లోనూ క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుందని పాఠశాల బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.